Home Politics Andhra Pradesh డిప్యూటీ సీఎం.. 80 సీట్లు

డిప్యూటీ సీఎం.. 80 సీట్లు

0

తమిళనాట విజయ్ కు ఆఫర్

బీజేపీ, టీవీకే మధ్య పొత్తుకు ఎత్తులు

2శాతం ఓట్ల నిర్ణయాత్మకశక్తి కావడంతో కసరత్తు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో విజయ్​ పార్టీ పొత్తు ఉంటుందనని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని టీవీకే పార్టీ స్పష్టం చేసింది. అయినా ఈ పొత్తు వార్తులు వస్తూనే ఉన్నాయి. తాజాగా విజయ్​కు బీజేపీ డిప్యూటీ సీఎం ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా టీవీకేకు 80 సీట్లు ఇవ్వనున్నట్లుగా సమాచారం. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ, టీవీకే మధ్య సీట్ల పంపకం చర్చలు తుదిదశకు చేరుకున్నాయని వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం కుదిరితే రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక విజయ్ మాత్రం భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవిని లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం. ఈ అంశం కూడా ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్​డీఏలోకి విజయ్​ పార్టీని తీసుకురావడానికి బీజేపీ పలు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. విజయ్‌తో సంప్రదింపులు కొనసాగించేందుకు ఇతర రాష్ట్రానికి చెందిన ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా మధ్యవర్తిగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. తమిళనాడులో విజయ్​కు భారీగానే అభిమానులు ఉన్నాయి. ఇదే ఇప్పుడు బీజేపీకీ కీలకంగా మారవచ్చని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కేవలం 2 శాతం ఓట్ల మార్పు కూడా ఫలితాన్ని ప్రభావితం చేయగలదని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే ఎన్‌డీఏతో పొత్తుపై విజయ్‌కు దగ్గరగా ఉన్న కొందరు సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. స్వతంత్ర రాజకీయ ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు వచ్చిన కొత్త పార్టీగా టీవీకే తన ప్రతిష్ఠను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ప్రారంభ దశలోనే జాతీయ కూటమిలో చేరితే పార్టీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్​ టీవీకేతో పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వెల్లడించారు. టీవీకేతో పొత్తు ఉంటుందని వస్తున్న వార్తలు కేవలం మీడియా ఊహాగానాలేనని తెలిపారు. ఇప్పటి వరకు ఆ పార్టీతో ఎలాంటి చర్చలు జరగలేదని, అలాంటప్పుడు ఎలా పొత్తు ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఎన్​డీఏతో పొత్తు ఉండదని టీవీకే స్పష్టం చేసింది. ఈ విషయమై జరుగుతున్న చర్చలు కేవలం ఊహాగానాలు మాత్రమే అని కొట్టిపారేసింది. అయినా పొత్తు సంబంధించిన వార్తలు వస్తూనే ఉండటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీవీకే ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. పార్టీకి వచ్చిన దరఖాస్తుల్లో నుంచి సుమారు 60 మందిని విజయ్ ఇంటర్వ్యూ చేసి కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అయితే కూటమి ఏర్పడితే ఆ సీట్లలో కొన్ని మిత్రపక్షాలకు ఇవ్వాల్సి వస్తుందా అనే అంశంపై కూడా జిల్లా నాయకుల అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్​డీఏ సీట్ల కేటాయింపుపై చర్చలను ఇంకా ప్రారంభించ లేదు. ఇక అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగమైన 21 పార్టీలతో సీట్ల కేటాయింపులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పొత్తులో భాగంగా మిత్రపక్షం కాంగ్రెస్​కు డీఎంకే 28 సీట్లు కేటాయించింది. ప్రస్తుతానికి ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే- కాంగ్రెస్, బీజేపీ- అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తున్నాయి. మరి విజయ్​ ఒంటరిగా బరిలోకి దిగుతారా లేదా ఎన్​డీఏతో పొత్తు పెట్టుకుంటారా అనేది చూడాల్సి ఉంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version