బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో సోము వీర్రాజు
రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతిని అంతమొందించడానికే బీజేపీ ఆవిర్భవించిందని మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. సోమవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ 46 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పరశురామ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సోము వీర్రాజు హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాలలో అవినీతిని తొలగించడానికే బిజెపి ఆవిర్భవించిందని అన్నారు. అంత్యోదయ స్పూర్తితో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా అధ్యక్షులు పరశురామ రాజు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కొరకు పార్టీ చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్ర మోహన్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి వీ నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కేశవకాంత్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, విశాఖ జిల్లా మహిళా మోర్చా ప్రెసిడెంట్ నాదేళ్ల జ్యోతి, దాడి పురుషోత్తం రమేష్, బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ సెల్ మెంబర్ బొచ్చా సురేష్ కుమార్, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ కరణంరెడ్డి నరసింగ రావు, బీజేపీ జిల్లా పదాధికారులు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
