Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshహై అలెర్ట్..!

హై అలెర్ట్..!

యుద్ధ ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలి

సమన్వయంతో నిరంతర నిఘా అవసరం

రాష్ట్రాలకు కేంద్రం గత నెల 28న లేఖ

రెచ్చగొట్టే వ్యాఖ్యలపై నజర్

సోషల్ మీడియాపై డేగకన్ను

ఇజ్రాయెల్– ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పైనా పడే అవకాశాలపై కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో ఎక్కడైనా సామాజిక, మత పరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. శాంతి భద్రతలపై ప్రభావం చూపొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక లేఖ రాసింది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం, అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాలు చేపట్టిన సైనిక చర్యల తర్వాత దేశంలో కొన్ని వర్గాలు భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. ఫిబ్రవరి 28న రాష్ట్రాలకు పంపిన లేఖలో అప్రమత్తంగా ఉండాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ముఖ్యంగా మతపరమైన సభలు, సమావేశాలు, ప్రసంగాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించింది. హోంశాఖ లేఖలో కీలకంగా ప్రస్తావించిన అంశం రెచ్చగొట్టే ప్రసంగాలు. కొన్ని తీవ్రవాద భావజాలం కలిగిన వ్యక్తులు విదేశీ పరిణామాలను ఉపయోగించుకుని ప్రజలను ప్రేరేపించే ప్రయత్నం చేయొచ్చని హెచ్చరించింది. ఇరాన్​కు వ్యతిరేక భావజాలంతో ఉన్న కొంతమంది మత ప్రచారకులు ఉద్రిక్తతలు సృష్టించేలా ప్రసంగాలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఇలాంటి ప్రసంగాలు స్థానికంగా సామాజిక కలహాలకు దారి తీసే ప్రమాదం ఉందని, అందుకే ముందుగానే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర యంత్రాంగాన్ని ఆదేశించింది. సోషల్ మీడియా వేదికల్లో కూడా పుకార్లు, తప్పుడు ప్రచారం వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని, వాటిని వెంటనే అరికట్టాలని సూచించింది. రాష్ట్ర పోలీస్ విభాగాలు, స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్లు, కేంద్ర ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచాలని కేంద్రం తెలిపింది. అనుమానాస్పద సమావేశాలు, గుంపులు, విద్వేషపూరిత పోస్టులు, విదేశీ నిధుల ప్రవాహం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకునేలా కంట్రోల్ రూమ్‌లను సిద్ధంగా ఉంచాలని, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని ఆదేశాలు ఇచ్చింది. తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలు, విద్వేషపూరిత పోస్టులు వేగంగా వ్యాప్తి చెందే ఈ కాలంలో సోషల్ మీడియా పర్యవేక్షణ కీలకమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఉండే సమాచారాన్ని వెంటనే తొలగించాలనీ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే ప్రజలకు కూడా అప్రమత్తత అవసరమని, పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments