బ్యాంకు పెన్షనర్లకుళ పెన్షన్ సవరణ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి ప్రాంతానికి చెందిన పెన్షనర్లు నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి నాయకులు, మేనేజ్‌మెంట్ ప్రతినిధులు, ఏజీబీఓ సభ్యులు తదితరులు హాజరయ్యారు. రాజమండ్రి ప్రాంతం నలుమూలల నుంచి 2000 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.
సమావేశంలో ప్రధానంగా పెన్షన్ సవరణ అంశంపై చర్చ జరిగింది. పదవీ విరమణ అనంతరం దాదాపు 30 సంవత్సరాలుగా పెన్షన్ సవరణ జరగకపోవడం పట్ల పెన్షనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. 1986 నుంచే ఇంపీరియల్ బ్యాంక్, అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెన్షన్ అమలులో ఉన్నప్పటికీ, సంవత్సరాలుగా సవరణ చేపట్టలేదని పేర్కొన్నారు.
ఇతర బ్యాంకుల్లో 1995లో పెన్షన్ ప్రవేశపెట్టినప్పటి నుంచి పెన్షన్ నిలిచిపోయిందని, అయితే సేవలో ఉన్న ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకు వేతనాలు, భత్యాలు సవరించబడుతున్నాయని తెలిపారు. 1995 పెన్షన్ నియమావళి చట్టంలోని సెక్షన్ 35(1) ప్రకారం పెన్షన్, అదనపు పెన్షన్ అవసరమైనప్పుడు సవరించాల్సిన నిబంధన ఉన్నప్పటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు.
ఈ అంశంపై పంజాబ్-హర్యానా హైకోర్టులో కేసు దాఖలై, అనంతరం 2006లో సుప్రీంకోర్టులో అప్పీల్ నమోదైనట్టు తెలిపారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) సుప్రీంకోర్టులో తప్పుదారి పట్టించే అఫిడవిట్ దాఖలు చేసిందని, పెన్షన్ సవరణకు చట్టబద్ధ నిబంధన లేదని పేర్కొన్నట్టు ఆరోపించారు. ప్రస్తుతం కొంతమంది ఐబీఏ భాగస్వాములు పెన్షన్ సవరణకు నిబంధన ఉందని అంగీకరిస్తున్నారని వెల్లడించారు. ఈ కేసు ఈ నెలాఖరులో సుప్రీంకోర్టులో మళ్లీ విచారణకు రానుందని తెలిపారు.
జనరల్ బాడీ సమావేశం ద్వారా చైర్మన్, జనరల్ మేనేజర్‌లకు వినతిపత్రం సమర్పించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. పదవీ విరమణ అనంతరం కూడా బ్యాంకుతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నామని, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పెన్షన్ సవరణ చేపట్టాలని బ్యాంకు పెన్షనర్ల డిమాండ్
RELATED ARTICLES
