ప్రారంభించిన సీఎండీ పృథ్వీతేజ్
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ ఉద్యోగుల క్రీడాపోటీలను సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ మంగళవారం ప్రారంభించారు. విశాఖపట్నం రైల్వే మైదానంలో విశాఖపట్నం సర్కిల్ రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ మీట్‌ను సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ గాలిలో బెలూన్లు, పావురాలను ఎగురవేసి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని డివిజన్ల నుంచి సుమారు 300 మంది విద్యుత్ ఉద్యోగులు, క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పురుషుల విభాగంలో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ పోటీలు జరుగుతుండగా, మహిళల విభాగంలో టగ్ ఆఫ్ వార్, షటిల్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్, మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్ వంటి క్రీడలు నిర్వహిస్తున్నారు. హోళి పర్వదినాన్ని పురస్కరించుకుని పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ ఉద్యోగులకు క్రీడలు ఎంతగానో అవసరమని, తరచూ క్రీడల్లో పాల్గొంటే విధుల్లో మరింత ఉత్సాహం, చురుకుదనం పెరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అత్యంత ముఖ్యమని తెలిపారు. క్రీడల ద్వారా పట్టుదల, క్రమశిక్షణ, పోటీతత్వం వంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అనంతరం ఆయన షటిల్ బ్యాడ్మింటన్‌లో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ టి.వి. సూర్యప్రకాష్ మాట్లాడుతూ నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉండే ఉద్యోగులకు మానసిక, శారీరక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జీ. శ్యాంబాబు, జనరల్ సెక్రటరీ పోలాకి శ్రీనివాసరావు, సెక్రటరీ ఏ. పార్ధసారధి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎం. ధర్మరాజు, బి.కె. నాయుడు, బి. సింహాచలం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

