Saturday, June 13, 2026
HomePoliticsAndhra Pradeshఅంతరాలయ దర్శనాలు తెల్లవారు 5కే ముగించాలి

అంతరాలయ దర్శనాలు తెల్లవారు 5కే ముగించాలి

చందనోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు ఆలయ అధికారులు – జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరేందిరా ప్రసాద్ పేర్కొన్నారు. ఆలయ ఈవో జె. వెంకటరావుతో కలిసి ఆయన కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులు, క్యూ లైన్ల నిర్మాణాలను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బారికేడింగ్‌తో సహా అన్ని సివిల్, నిర్మాణ పనులను మార్చి 31లోపు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, సంతృప్తికరంగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, గతంలో గాలులు, వర్షాల వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, క్యూ లైన్ల వెంబడి సాధ్యమైనంత వరకు శాశ్వత షెల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు.
ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ తనిఖీలు తప్పనిసరిగా నిర్వహించాలని,
సాధారణ భక్తులకు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10–11 గంటల వరకు దర్శనం కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, వి ఐ పీ / వి వి ఐ పీ దర్శనాలకు ఉదయం 3 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక టైమ్ స్లాట్లు కేటాయింపునకు మార్గదర్శకాలు సూచించారు. ఆరోజు ఉదయం 5 గంటలలోపు అంతరాలయ దర్శనాలు ముగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. రూ. 300, 1000, 1500 దర్శన క్యూ లైన్లు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రారంభించి, రద్దీ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రాకపోకల కోసం బస్సుల నిర్వహణ, పికప్–డ్రాప్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలపై స్పష్టమైన ప్లాన్ సిద్ధం చేయాలని సూచన చేశారు. ఆలయ ప్రాంగణంలోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని, పోలీస్ సిబ్బంది, సేవా వలంటీర్లతో నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ ఏడాది సుమారు 1.20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనావేస్తున్నట్టు, దర్శనం అనంతరం భక్తులు వేగంగా బయటకు వెళ్లేందుకు ఆగమశాస్త్రం ప్రకారం అదనపు ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులతో చర్చల అనంతరం, దర్శన సమయాలపై తుది నిర్ణయాన్ని మీడియా ద్వారా అధికారికంగా ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమీక్ష అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్య నిర్వహణ అధికారి జె వెంకటరావు స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభమాలింగనము తదుపరి స్వామి వారి దర్శనము అనంతరము వేద పండితుల వేద ఆశీర్వచనము తదుపరి స్వామివారి ప్రసాదాలని అందజేశారు.
వీరితో ఆలయం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ, సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు, ఇంజనీరింగ్ అధికారులు, టూరిజం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments