Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshసీఐడీ అధికారుల ప్రశ్నల వర్షం- వింత సమాధానాలిచ్చిన వైసీపీ నేత

సీఐడీ అధికారుల ప్రశ్నల వర్షం- వింత సమాధానాలిచ్చిన వైసీపీ నేత

  • ఉక్కిరిబిక్కిరి..!
  • పరకామణి చోరీపై భూమన విచారణ
  • సీఐడీ అధికారుల ప్రశ్నల వర్షం
  • వింత సమాధానాలిచ్చిన వైసీపీ నేత

(తిరుమల – జయజయహే)

తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడీ అధికారులు అరగంటపాటు ప్రశ్నించారు. పరకామణి చోరీ సమయంలో టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా, కేసు రాజీ సమయంలో టీటీడీ ఛైర్మన్​గా ఉన్న కరుణాకర్ రెడ్డిని తిరుపతిలోని పద్మావతి అతిథిగృహం కేంద్రంలో విచారణకు పిలిచారు. అరగంట సేపు భూమనను అధికారులు విచారించారు. అయితే అనంతరం బయటకు వచ్చిన భూమన మీడియా ప్రశ్నలకు వింత సమాధానాలిచ్చారు. తిరుమల పరకామణి చోరీ కేసులో వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్‌ డాలర్లను చోరీ చేస్తూ పట్టుబడిన పరకామణి ఉద్యోగి రవిపై 2023 ఏప్రిల్‌ 7న కేసు నమోదైంది. అప్పట్లో టీటీడీ ఏవీఎస్‌వోగా పనిచేసిన సతీశ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు తిరుమల ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం తిరుపతి పద్మావతి అతిథిగృహంలోని కార్యాలయంలో భూమన విచారణకు రావాలని నోటీసులో పేర్కొనగా అందుకనుగుణంగా ఆయన విచారణకు హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పరకామణి కేసు దర్యాప్తును సీఐడీ బృందం వేగవంతం చేసింది. సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్వయంగా ఈ కేసు విచారణ చేపట్టారు. తిరుపతి పద్మావతి అతిథిగృహంలో సీఐడీ డిజీ రవిశంకర్ అయ్యన్నార్ దర్యాప్తు బృందం పలువురిని విచారించింది. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో పర్యటించి కేసుకు సంబందించిన వివరాలను సేకరించింది. డిసెంబర్‍ 2 లోపు కేసుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు అందజేయాల్సిన నేపథ్యంలో విచారణ ముమ్మరం చేశారు. సీఐడీ విచారణకు వస్తూ ఏవీఎస్‌వో సతీష్‍ కుమార్ హత్యకు గురవ్వడంతో పరకామణి కేసు వారం రోజులుగా దర్యాప్తు మందగించింది.

తిరుపతి చేరుకున్న సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా విచారణ చేపట్టారు. అప్పటి టీటీడీ వీజీవో గిరిధర్‌ను విచారించారు. పరకామణి అధికారులు మొదట మీకు సమాచారం ఇచ్చారా? అని ఆరా తీశారు. చోరీకి సంబంధించి టీటీడీ విజిలెన్స్ విభాగం ఎలాంటి విచారణ చేపట్టింది? దానికి సంబంధించిన దస్త్రాలు, వివరాలు ఎవరికి సమర్పించారని ప్రశ్నించారు. తాము సేకరించిన సమాచారాన్ని అప్పటి CVSO నరసింహకిషోర్​కు అందజేసినట్లు సీఐడీ అధికారులకు వివరించినట్లు తెలిసింది. లోక్‍ అదాలత్‌లో కేసు రాజీ అంశంపై ఏవీఎస్‌వో సతీష్‍ కుమార్‌కు సలహాలు ఇచ్చారా? రాజీ చేసుకోమని అతనిపై ఒత్తిడి ఉన్నట్లు గమనించారా అని సిట్‍ అధికారులు గిరిధర్​ను ప్రశ్నించారు. ఆయనతో పాటు అప్పటి మరో ఏవీఎస్‌వో పద్మనాభాన్ని సీఐడీ అధికారులు కేసు గురించి ప్రశ్నించారు.

పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్ సమీప బంధువులనూ విచారించారు. చైన్నైకి చెందిన దంపతులు సోమవారం సిట్ కార్యాలయానికి వచ్చారు. నిందితుడికి చెన్నైలో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి? గిఫ్ట్ డీడ్‍గా ఇచ్చిన ఆస్తుల రిజిస్ట్రేషన్ గురించి ఆరా తీశారు. రవికుమార్ ఆస్తులు కూడబెట్టే సమయంలో ఏమి చెప్పేవారని మరెమైనా ఇతర ఆస్తులు ఉన్నాయా? అంటూ బంధువులను ఆరా తీశారు. అప్పటి టీటీడీ అధికారులు, పరకామణి డిప్యూటీ ఈవో, పోలీస్‍ అధికారుల డ్రైవర్లను సిట్ విచారణకు పిలిచింది. నిందితుడు రవికుమార్ ఆస్తులు గుర్తించడం కోసం వెళ్లిన అధికారులు ఎవరని? ఏఏ ప్రాంతాలలో ఆస్తులపై ఆరా తీశారని అధికారుల డ్రైవర్లను ప్రశ్నించారు. నిందితుడు రవికుమార్ తోపాటు పరకామణి కేసులో కీలక వ్యక్తుల బ్యాంకు లావాదేవీలపై సీఐడీ అధికారులు నిఘా పెట్టారు. తిరుపతిలోని కొన్ని బ్యాంకులకు నోటీసులు అందజేశారు. సంబంధిత పేర్ల మీద ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు జరిగాయో తెలియజేయాలని బ్యాంకులకు నోటీసులు ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments