Sunday, May 3, 2026
HomePoliticsAndhra Pradeshమిషన్ మోడ్ లో మున్సిపాల్టీలు

మిషన్ మోడ్ లో మున్సిపాల్టీలు

ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు

అధునాతన డ్రెయిన్లు నిర్మిస్తున్నాం

విశాఖ మెట్రోపై రైట్స్ కు అధ్యయన బాధ్యతలు

నివేదిక రాగానే కేంద్రంతో మాట్లాడి రంగంలోకి

పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడి

గాజువాకలో మంత్రి నారాయణ మంగళవారం ఉదయం పర్యటించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గాజువాక జోన్‌లోని గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను పరిశీలించారు. అలాగే 76వ వార్డులోని హెచ్‌బీ కాలనీలో అల్లూరి సీతారామరాజు పార్క్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. నగరంలో డంపింగ్ యార్డు అవసరం లేకుండా ఎప్పటికప్పుడు చెత్తను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌కు తరలిస్తున్నామని తెలిపారు. గాజువాకలో 4.75 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల వసతులతో పార్క్‌ను ప్రారంభించామని చెప్పారు. గత ప్రభుత్వం మున్సిపల్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి విమర్శించారు. మున్సిపాలిటీల్లో ప్రజలు కట్టిన పన్నులను ఇతర అవసరాలకు మళ్లించేసిందన్నారు. గత ప్రభుత్వం పక్కదారి పట్టించిన 1700 కోట్ల రూపాయల నిధులు ఇంకా మున్సిపాలిటీలకు రాలేదని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీల నిధులు అక్కడే ఖర్చు చేసేలా గ్రీన్ ఛానల్ తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు రూ.14 వేల కోట్లతో టెండర్లు పిలిచామని చెప్పారు. రాబోయే రెండేళ్లలో మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రూ.5000 కోట్లతో పలు నగరాల్లో పక్కా డ్రెయిన్లు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే మరో రూ.4000 కోట్లతో తాగునీరు, డ్రెయిన్లు, రోడ్లు, లైట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మిషన్ మోడ్‌లో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేలా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌పై రైట్స్ సంస్థతో కేంద్రం సర్వే చేయిస్తోందని… నివేదిక వచ్చిన తర్వాత కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్ట్ చేపడతామని మంత్రి నారాయణ వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments