సింహాచలం కు అభినందనల వెల్లువ
ఏపీఈపీడీసీఎల్ లైన్మెన్ గా అత్యుత్తమ పనితీరు కనబరచిన గాజువాక లైన్ ఇన్స్పెక్టర్ బి. సింహాచలం జాతీయస్థాయిలో ఉత్తమ లైన్మెన్ అవార్డు ను సాధించారని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమ, గృహ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు ఎంతో శ్రమిస్తున్న లైన్మేన్ల సేవలను గుర్తించి వారికి ధన్యవాదాలు తెలిపేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కు చెందిన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆధ్వర్యంలో థాంక్ ఏ లైన్మేన్ పేరిట లైన్మేన్ దివస్ కార్యక్రమాన్ని ప్రతి ఏటా మార్చిలో నిర్వహిస్తోందని సీఎండీ తెలిపారు. సంస్థ పరిధిలోని అన్ని సర్కిళ్లలో లైన్మెన్ దివస్ ను ఘనంగా నిర్వహించామని తెలిపారు. వర్షాలు, వరదలు, తుఫాన్ వంటి ప్రతికూల పరిస్థితులలో కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అంకితభావంతో రేయింబవళ్ళు పని చేస్తూ విద్యుత్ వెలుగులు అందించేందుకు కృషి చేస్తున్న లైన్మేన్లకు సీఎండీ లైన్మేన్ దివస్ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేసేందుకు ఈపీడీసీఎల్ అన్ని చర్యలు తీసుకుంటోందని లైన్మేన్లు విధి నిర్వహణలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్బంగా సూచించారు.
ఢిల్లీలో శనివారం జరిగిన లైన్మేన్ దివస్ కార్యక్రమంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ ఘనశ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా ఏపీఈపీడీసీఎల్ లైన్మేన్ గా అత్యుత్తమ పనితీరు కనబరిచి ఉత్తమ లైన్మేన్ అవార్డు ను అందుకున్న బి.సింహాచలం తో పాటు, ఉత్తమ లైన్మేన్లు గా ప్రశంసలు పొందిన విజయనగరం సర్కిల్ కు చెందిన కె.రాజు, వెస్ట్ గోదావరి సర్కిల్ జె.జానకిరాముడు కు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ లైన్మేన్లకు సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, సంస్థ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎం వి.విజయలలిత శుభాకాంక్షలు తెలిపారు.
