రత్నగిరిపై ఆధ్యాత్మిక పరిమళాలు
వైభవంగా సత్యదేవుని తెప్పోత్సవం
అన్నవరం,జయ జయహే న్యూస్:
ప్రేమకు,భక్తికి ప్రతీకగా నిలిచిన అన్నవరం రత్నగిరిపై కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది.ప్రతి ఏటా కార్తీకమాసం సందర్భంగా నిర్వహించే ఈ తెప్పోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.సాయంత్రం రత్నగిరి పైనుండి స్వామివారిని,అమ్మవారిని వెండి పల్లకిపై ఆసీనులుగా వేదమంత్రోచ్చారణ,మేళతాళాల నడుమ ఘాట్‌రోడ్ మార్గం గుండా కొండ దిగువన ఉన్న పవర్ హౌస్ వద్దకు తీసుకువచ్చారు.అక్కడ వివిధ సుగంధ పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక మండపంలో స్వామివారిని,అమ్మవారిని ఆత్మీయంగా ప్రతిష్ఠించారు.ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్బయ్య మరియు ఇంద్రగంటి నర్సింహమూర్తి ఆధ్వర్యంలో తులసీదాత్ర పూజ నిర్వహించారు.అనంతరం పంపా సరోవరంలో ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై స్వామివారిని,అమ్మవారిని ఆసీనులుగా చేసి తెప్పోత్సవం ఘనంగా ప్రారంభించారు.విద్యుత్ దీపాలంకరణ మధ్య,వేద మంత్రోచ్చారణలతో,మేళతాళాల నడుమ,భక్తులకు కనుల పండుగలా సత్యదేవుని–అనంతలక్ష్మీ అమ్మవార్ల నౌక విహారం మూడు సార్లు సరోవరంలో సాగింది.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభారాజ్, యనమల రాజేష్,ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్ ఐ.వి. రోహిత్ ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందజేశారు.కార్యక్రమం సజావుగా సాగేందుకు పెద్దాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
సత్యజ్యోతి ఊరేగింపుతో ప్రారంభం
ఉదయం అన్నవరంలో గల సుబ్బరాయపురం సాక్షి గణపతి ఆలయం వద్ద నుండి సత్య దీక్షాపరులు సత్యజ్యోతిని స్వామివారి ప్రచార రథంపై భక్తిగానములతో, వేదమంత్రోచ్చరణలతో, మేళతాళాల నడుమ రత్నగిరి శిఖరంపైకి తీసుకువచ్చారు.ఈ ఊరేగింపుతో తెప్పోత్సవ వేడుకలు మరింత భక్తిరసపూరితంగా మారాయి.అన్నవరంలో ప్రతి ఏడాది నిర్వహించే ఈ తెప్పోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, సాంస్కృతిక స్ఫూర్తిని ప్రసాదిస్తుంది. సత్యదేవుని సన్నిధి వద్ద జ్యోతి వెలుగులు, సంగీత నాదాలు, విద్యుత్ దీపాలంకరణ,అన్ని కలసి ఆ ప్రదేశాన్ని ఆకాశం తాకే భక్తి సoద్రంగా మలిచాయి.
