Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshగ్రామాలకు డిజిటల్ కనెక్టవిటీ

గ్రామాలకు డిజిటల్ కనెక్టవిటీ

5 లక్షల ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు

భారత్ నెట్ ఇన్ ఫ్రా పేరుతో ఎస్పీవీ

డిజిటల్ భారత్ నిధితో ప్రభుత్వం ఒప్పందం

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక సహకార ఒప్పందం కుదిరింది. సుమారు 5 లక్షల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ అమలు చేయనుంది. రాష్ట్రంలో ఏబీపీ అమలుకు రూ. 2,432 కోట్ల మేర నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఏబీపీ కోసం ఆంధ్రప్రదేశ్ భారత్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుతో ఎస్పీవీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిజిటల్ భారత్ నిధి – రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అంగీకారంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టు అమలు చేసేలా చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు, కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో డిజిటల్ భారత్ నిధి – ఏపీ ప్రభుత్వం మధ్య ఎంఓయూ కుదిరింది. ఎంఓసీపై డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, రాష్ట్ర ఐ అండ్ ఐ శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు సంతకాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్‌ఫ్రా బలోపేతం, గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించేలా సహకార ఒప్పందం చేసుకుంది. రైట్ ఆఫ్ వే అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, క్షేత్ర స్థాయి సమన్వయానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,426 గ్రామ పంచాయతీలలో ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు చేసింది. 1,692 ఫేజ్-I పంచాయతీల్లోని నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడం, 11,254 ఫేజ్-IIలోని గ్రామాల డిజటల్ కనెక్టివిటీని పూర్తి చేయడం.. ఇక కొత్తగా ఏర్పడిన 480 గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు చేపట్టింది. 3942 గ్రామాల్లో డిమాండ్ ఆధారంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంచే అంశంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. డిజిటల్ కనెక్టివిటీ ద్వారా డిజిటల్ గవర్నెన్స్, ఆన్‌లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, ఈ-గవర్నెన్స్ వంటి సేవలను మరింత బలోపేతం చేసేలా ఏపీ సర్కార్ ప్రణాళికలను రూపొందించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments