Friday, June 12, 2026
HomePoliticsAndhra Pradeshగూగుల్ డేటా సెంటర్ భూసేకరణ సంపూర్ణం

గూగుల్ డేటా సెంటర్ భూసేకరణ సంపూర్ణం

గంటా చొరవతో ముందుకొచ్చిన రైతులు*
ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ కోసం చేస్తున్న భూసేకరణ పూర్తయ్యింది. ఇప్పటివరకూ భూమి ఇవ్వని దివ్యాంగుడైన రైతు గణేష్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో మంగళవారం అంగీకార పత్రాలను మండల రెవిన్యూ అధికారులకు సమర్పించారు. అంతకుముందు భీమిలి బాలికల గురుకుల పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్న గంటాను కలిశారు. ప్రభుత్వం నుంచి అదనంగా పరిహారం తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. శాలువా కప్పి ఆయనపై అభిమానాన్ని చాటుకుని తన 1.94 ఎకరాల అసైన్డ్ భూమి గూగుల్ డేటా సెంటర్ కోసం ఇస్తున్నట్టు చెప్పారు. విశాఖకు గ్రోత్ ఇంజన్ గా కానున్న గూగుల్ కు భూమి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నందుకు గణేష్ ను గంటా అభినందించారు. గూగుల్ డేటా సెంటర్ కోసం మొత్తం 308 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.

*వైసీపీ కుట్రలకు చెక్*

ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే ఎక్కువ ఇస్తామని వైసీపీ నాయకుల బినామీ ఒకరు రైతులను మభ్య పెట్టడంతో ప్రారంభంలో కొందరు ఆలోచనలో పడ్డారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ లు సీఎం విశాఖ వచ్చినప్పుడు పరిస్థితి వివరించి.. ఎకరా రూ. 17 లక్షలుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ రేట్ స్థానంలో పరిహారాన్ని రూ. 20 లక్షలకు పెంచేలా చేశారు. ఎకరంలో 80 సెంట్ల భూమికి రెండున్నర రెట్ల పరిహారాన్ని, అంటే రూ.40 లక్షలు కాకుండా 20 సెంట్ల భూమి కూడా ఇస్తామని ప్రకటించారు. అలాగే ఇంటికో ఉద్యోగం, ఉపాధి కోసం షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక షాపు, బంజరు భూముల అభివృద్ధి పథకం కింద సాగు చేస్తున్న 520 మంది రైతులకు 3 సెంట్ల నివేశన స్థలాలు ఇస్తామని చెప్పడంతో అధికశాతం మంది రైతులు భూములివ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు. గంభీరంలో ఐఐఎం కోసం భూసేకరణ చేసినప్పుడు విద్యా శాఖ మంత్రిగా ఉన్న గంటా అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చారని పేర్కొంటూ తర్లువాడ మాజీ సర్పంచ్ మజ్జి వెంకట్రావు (వైసీపీ) భూములివ్వడానికి ముందుకు వచ్చారు. మొత్తం 51 మంది అసైనీలు కూడా భూములు ఇవ్వడానికి అంగీకరిస్తూ అధికారికంగా పత్రాలు ఇవ్వడంతో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణ పూర్తయ్యిందని ఎమ్మార్వో ఎస్.శ్రీనుబాబు చెప్పారు. వచ్చే నెలలో శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నందున ఎలాంటి వివాదాలు లేకుండా భూసేకరణ పూర్తి కావడం శుభపరిణామంగా గంటా పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments