జెఎన్ రోడ్డు వెంకటేశ్వనగర్లోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అమృత్ 2.0 పథకం కింద నగరాభివృద్ధికి రూ.135 కోట్లు మంజూరు చేయించడంతో పాటు, నగరాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఖేలో ఇండియా పథకం కింద రూ.13.76 కోట్ల నిధులు తీసుకురావడంపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎంపీ పురంధేశ్వరి గారికి అభినందనలు తెలిపారు.
అలాగే 2027లో జరగనున్న పుష్కరాల ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరాన్ని ఇరువురు ప్రస్తావించారు. ఘాట్లు, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాల్లో సమగ్ర కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమన్వయంతో తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
నగరంలో మిగిలి ఉన్న రెండు స్పోర్ట్స్ కాంప్లెక్సుల పనులను వేగవంతం చేయాలని ఎంపీ సూచించారు. శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంపై కూడా ఎంపీ ప్రశంసలు తెలిపారు. నగర సమగ్రాభివృద్ధికి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఇరువురు నాయకులు స్పష్టం చేశారు.
అభివృద్ధి, పుష్కరాలపై ఎంపీ–ఎమ్మెల్యే చర్చలు
RELATED ARTICLES
