శ్రీ శారదా పీఠంను సందర్శించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి సంజయ్ కరోల్
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సంజయ్ కరోల్ ఆదివారం విశాఖ శ్రీ శారద పీఠంను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ కరోల్ పీఠ ప్రాంగణంలోని అన్ని దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠ అధిష్టాన దేవత అయిన శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో విశేష అర్చనలు జరిపించారు. పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ పూజ కార్యక్రమం అత్యంత భక్తి భావంతో జరిగింది. సందర్శన అనంతరం జస్టిస్ సంజయ్ కరోల్ మాట్లాడుతూ, విశాఖ శ్రీ శారదా పీఠం ప్రాంగణం ఎంతో ప్రశాంతతతో, ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి ఉందని అన్నారు. ముఖ్యంగా ఇక్కడ నిర్వహిస్తున్న వేద పాఠశాల ద్వారా వేద విద్యను సంరక్షిస్తూ, యువతకు ధార్మిక విలువలను బోధించడం అభినందనీయమని పేర్కొన్నారు. వేద సంప్రదాయం మన భారతీయ సంస్కృతికి మూలస్తంభమని, వేదాల ద్వారా మాత్రమే సనాతన ధర్మాన్ని, సంస్కృతిని పరిరక్షించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఋషికేశ్‌లో నిర్మితమైన విశాఖ శ్రీ శారదా పీఠం ఘాట్ ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారిని దర్శించుకునే భాగ్యం తనకు లభించిందని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ, వేద సంస్కృతి అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలలో పీఠం చేస్తున్న సేవలు విశేషమని కొనియాడారు. ధర్మ రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పీఠాధిపతుల పట్ల ఆయన గౌరవాభిమానాలను వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా పీఠం శ్రీకార్యం పొణంగి కిషోర్ కుమార్ శర్మ న్యాయ మూర్తి సంజయ్ కరోల్ కి పీఠ ప్రాంగణంలోని అన్ని ఆలయాలను దర్శనం చేయించి, అమ్మవారి శేష వస్త్రాన్ని, జగద్గురు ఆది శంకరాచార్యుల వారి ప్రతిమను అందజేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.
