అంగరంగ వైభవంగా సాంస్కృతిక ప్రదర్శనలు
కళాకారుల జైత్రయాత్రతో పులకించిన గుంటూరు ,గుంటూరు నగరం గత ఐదు రోజులుగా వెల్లివిరిసిన అంతర్జాతీయ నాటక కళా సౌరభం మంగళవారం నాటి ముగింపు వేడుకలతో పతాక స్థాయికి చేరింది. ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, యడ్లపాడు ‘వేదిక’ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 25వ భారత రంగ్ అంతర్జాతీయ నాటక మహోత్సవాలు ఆఖరి రోజున అద్భుత ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచాయి. వేదిక అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు సారధ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించిన భారీ కళా ప్రదర్శన ర్యాలీ కళాత్మక వాతావరణం నింపింది. వందలాది మంది కళాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ ప్రదర్శన గుంటూరు వీధుల్లో సాగి, బళ్లారి రాఘవయ్య ఓపెన్ ఎయిర్ థియేటర్ వద్దకు చేరుకుంది.
*కళాజాతర..కన్నుల పండుగ*:
ముగింపు ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక పోటీలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. వివిధ పాఠశాలలు, డాన్స్ అకాడమీలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు భారతీయ సంస్కృతికి అద్దం పట్టాయి. ముఖ్యంగా నరసరావుపేట వీఐటీ స్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద నృత్యాలు సభికులను అబ్బురపరిచాయి. అలాగే రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థినులు తమ జానపద నృత్యాలతో పల్లెటూరి పసందైన వాతావరణాన్ని వేదికపై సాక్షాత్కరింపజేశారు. గుంటూరుకు చెందిన అను డాన్స్ అకాడమీ వారు ప్రదర్శించిన డాన్స్ కేవ్వుకేక అనిపించాయి. ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన ఈ ప్రదర్శనలకు కళాభిమానులు నీరాజనాలు పట్టారు.
*దేశ భద్రత కోసం సాగిన ఓ చారిత్రక తిరుగుబాటే..*
– *‘ఒన్స్ ఇన్ ఇండియా’ ఆంగ్ల నాటకం*
దయా ప్రకాష్ సిన్హా రచనలో, ఆయుషి త్రిపాటి దర్శకత్వంలో ’అప్‌స్టేజ్ ఆర్ట్ గ్రూప్’ ప్రదర్శించిన ’ఒన్స్ ఇన్ ఇండియా’ నాటకం 22 శతాబ్దాల నాటి మౌర్య సామ్రాజ్య పతనాన్ని కళ్లకు కట్టింది. విదేశీ దండయాత్రల నుండి దేశాన్ని కాపాడలేక, కేవలం అహింస పేరుతో మౌనంగా ఉన్న చివరి మౌర్య రాజు బహద్రధుడిని సైనిక తిరుగుబాటు ద్వారా పడగొట్టిన చారిత్రక సంఘటనను ఈ నాటకం అద్భుతంగా ఆవిష్కరించింది. గ్రీకు సంస్కతి, మౌర్య వైభవాల కలయికగా సాగే ఈ కథ, జాతీయ భద్రత విషయంలో హింస–అహింసల మధ్య ఉండే నైతిక సంఘర్షణను చర్చిస్తుంది. చరిత్రను కేవలం కథనంలా కాకుండా, దేశ రక్షణ పట్ల ఒక బాధ్యతాయుతమైన సందేశాన్ని ఇచ్చేలా ఈ ప్రదర్శన ఆకట్టుకుంది.
