తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ,ఘనంగా భారత్ రంగ్ మహోత్సవ్ వేడుకలు ,ఏపీలో ఎన్‌ఎస్‌డీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తా: ఎమ్మెల్యే ప్రత్తిపాట
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మరియు ‘వేదిక’ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్ – అంతర్జాతీయ నాటకోత్సవాలు నాలుగో రోజు అత్యంత వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమానికి వేదిక అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు అధ్యక్షత వహించారు. డాక్టర్ ముత్తవరపు భార్గవి చౌదరి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు నాటకం అంతర్జాతీయ స్థాయికి సాటి అని నిరూపించే స్థాయిలో భారత్ రంగ్ మహోత్సవ్ కొనసాగుతోందని ప్రశంసించారు. ఉత్సవాల్లో ప్రదర్శించిన పోలాండ్ నాటకాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అందులోని పప్పెట్రీ, సాంకేతికతను మన ప్రాచీన పద్య విద్యతో పోల్చి వివరించారు.
తెలుగు నాటకాల్లో పప్పెట్రీ, మిమిక్రీ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మన కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో ముందంజలో ఉన్నారని అన్నారు. విదేశీ నటుల డైలాగ్ డెలివరీ చూస్తుంటే మహానటుడు ఎస్.వి. రంగారావు గుర్తుకు వచ్చారని కొనియాడారు. ఆధునిక ఆంగ్ల నాటకాలకు తెలుగు నాటక రంగం ఏమాత్రం తీసిపోదని స్పష్టం చేశారు.
*అమరావతిలో ‘అమరజీవి’ స్మృతి*
మార్చి 16న అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని గోపాలకృష్ణ తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ సహకారంతో అక్కడ టూరిజం స్పాట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అదే రోజు ‘అమరజీవి’ నాటకాన్ని ప్రదర్శించి, ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
*కళాకారులకు అండగా ప్రభుత్వం*
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. గతంలో సినిమా, టీవీలకే పరిమితమైన ‘నంది’ అవార్డులను నాటక రంగానికి కూడా విస్తరించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని గుర్తుచేశారు. సోషల్ మీడియా ప్రభావంతో నాటక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో, ఇంతటి భారీ అంతర్జాతీయ నాటకోత్సవాలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం అభినందనీయమన్నారు. దీనికి వేదిక అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు చేసిన కృషిని కొనియాడారు.
ఎన్‌ఎస్‌డీ కేంద్రానికి స్థల కేటాయింపు
రాష్ట్రంలో ఎన్‌ఎస్‌డీ చాప్టర్ లేకపోవడం ఒక లోటుగా భావిస్తున్నామని, దాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. డాక్టర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఎన్‌ఎస్‌డీ శాశ్వత కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థల కేటాయింపుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాటక పరిషత్తులకు పుట్టినిల్లు చిలకలూరిపేట అని గర్వంగా పేర్కొన్నారు. భవన నిర్మాణ బాధ్యతను సురేష్‌బాబు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు
