` ఉత్తరాంధ్రను కాపాడుకుందాం
– రూ.5వేల కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ
– అక్రమించిన భూమిలో యధేచ్చగా నిర్మాణాలు
– ఎకరా కేవలం 99 పైసలకే 30 ఎకరాలా
– ఉర్సా, సత్వా, లూలూ.. అంతా బోగస్ కంపెనీలే
– భూ దోపిడీపై వైసీపీ మహా పోరాటం
` వైసీపీ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు
విశాఖపట్నం, మార్చి 22, జయ జయహే :
విశాఖపట్నంలో అధికార పార్టీ అండతో సాగుతున్న భూ దోపిడీపై వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కే.కే. రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గీతం యూనివర్సిటీ సాగిస్తున్న బరితెగింపు చర్యలను, అధికారుల నిర్లక్ష్యాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. సీఎం బంధువు, అధికార పార్టీ ఎంపీకి చెందిన గీతం యూనివర్సిటీ రూ.5వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు మొద్దు నిద్రపోతున్నారని మండిపడ్డారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణమని తేల్చి చెప్పారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే…
విశాఖ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన రూ. 5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించుకోవడం అరాచకానికి పరాకాష్ట. గడిచిన కొద్ది రోజులుగా గీతం ఆధీనంలో ఉన్న 54.49 ఎకరాల ప్రభుత్వ మరియు అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలన్న కలెక్టర్ ఆదేశాలను, విశాఖ కార్పొరేషన్ కౌన్సిల్ ఎజెండాలో చేర్చి ఎలాంటి చర్చ లేకుండా అప్రజాస్వామికంగా ఆమోదించడం సిగ్గుచేటు. ఈ భూములపై కోర్టులో కేసులు నడుస్తున్నా, మేధావులు గొంతెత్తుతున్నా లెక్కచేయకుండా ఒక ఎంపీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నాడు. ప్రభుత్వ భూమి అని గతంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను గీతం యాజమాన్యం బరితెగించి తొలగించింది. ప్రస్తుతం ఆ భూమిలో ప్రొక్లెయినర్లతో అక్రమ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. దీనిపై వందలాది మంది ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించినా ఫలితం లేదు. ‘మా నోటీసులో లేదు’ అని కలెక్టర్ చెబుతున్నారంటే, అధికారుల అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. రెండు వారాలుగా నిర్మాణాలు జరుగుతున్నా ఒక్క అధికారి కూడా అటువైపు చూడకపోవడం వెనుక భారీగా లంచాలు చేతులు మారాయని స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన జీవీఎంసీ కమిషనర్ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ మొద్దు నిద్రపోతున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత మీపై లేదా? మీడియాలో వరుసగా కథనాలు వస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేంటి? ఒక ఎంపీ భరత్ బెదిరింపులకు లొంగిపోతారా లేక లంచాలకు కక్కుర్తి పడి మౌనంగా ఉంటున్నారా.. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల సర్వీసులో ఇదొక మాయని మచ్చగా మిగిలిపోవడం ఖాయం అని ముగించారు. దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేవంలో తూర్పు నియోజక వర్గ పరిశీలకులు మొల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
