Thursday, April 23, 2026
HomePoliticsAndhra Pradeshఉద్యోగాల ఎర...లక్షల్లో వల

ఉద్యోగాల ఎర…లక్షల్లో వల

నిరుద్యోగుల డ్రీమ్స్…సుమతి డీల్స్…!

ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం వస్తుందంటే ఎవరు కాదంటారు…నిరుద్యోగులైతే ఎగిరి గంతేస్తారు. అలాంటి నిరుద్యోగుల డ్రీమ్స్‌ను కేజీహెచ్‌లోని ఓ లేడీ డాన్ చాక చక్యంగా డీల్ చేస్తుంటారు. ఎంతో గౌరవ మర్యాదలతో పలకరించి తన కార్యాలయానికి ఆహ్వానించి మరీ ఉద్యోగాల ఎర వేసి రూ. లక్షల్లో దోచుకుంటారు. ఒకరిద్దరికి కింది స్థాయి పోస్టుల్లో నియమించి వాళ్ల ద్వారా మరింత మందిని ఆకర్షించి రూ. కోట్లకు పడగలెత్తుతున్నారు. ఆమె ఎవరో కేజీహెచ్‌లో ఎవరిని అడిగినా ఠక్కున చెప్పేస్తారు. ఆ లేడీ డాన్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కేజీహెచ్‌లోనే కాదు…బయట కూడా తన అధికార హోదాను తాకట్టు పెట్టేసి మరీ ఛీటింగ్ చేయాలనుకోవడాన్ని ఉద్యోగులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎంత అధికారి అయితే మాత్రం ఇలా ఉద్యోగాలు వేయిస్తానంటూ తన కార్యాలయం చుట్టూ ఎలా తిప్పుకుంటుందంటూ ప్రశ్నిస్తున్నారు. బాధితులు…ఇతర వర్గాలు అందించిన సమాచారం మేరకు ఆ వివరాలిలా ఉన్నాయి.
ఆమె కుమార్తె ప్రసవం కోసం జిల్లా పరిషత్ జంక్షన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఓ నర్సును పరిచయం చేసుకుంది. ఆమెకు ఉద్యోగ ఆశలు రేకెత్తించింది. మాయ మాటలతో బుట్టలో పడేసింది. స్టాఫ్ నర్సు ఉద్యోగం వేయిస్తానంటూ రూ. లక్షల్లోనే కాజేసింది. తన కుమార్తె కోసం ఆ నర్సుతో అడ్డమైన చాకిరీ చేయించుకుని…ఆ నర్సు ద్వారా వైద్య సేవలు…మెడికల్స్…డయాగ్నస్టిక్స్…ఇలా అన్ని సేవలు వినియోగించుకోవడంతో పాటు స్టాఫ్ నర్సు ఉద్యోగం ఆశ పెట్టి భారీగానే నొక్కేసిందన్నది కేజీహెచ్ టాక్. ఇంతకీ ఆమెకు ఉద్యోగం ఇస్తామంటూ అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ తిప్పుకుంటుందని సమాచారం. తన సేవలు.. పొంది…ఉన్నదంతా ఊడ్చి ఇచ్చినా…రేపో మాపో అంటూ తిప్పించుకోవడాన్ని చూసి బాధితురాలు బావురుమనలేక పంటి బిగువున ఆ బాధను భరిస్తోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే…ఉన్నదీ పోయి…ఉంచుకున్నదీ పోయినట్టవుతుందన్న ఉద్దేశ్యంతో వేచి చూద్దాంలే అన్నట్టుగా పాపం ఆ బాధితులు తిరుగుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments