Home Politics Andhra Pradesh పాల కల్తీపై ఫోరెన్సిక్ రిపోర్టు ఎక్కడ? – మాజీ ఎంపీ భరత్

పాల కల్తీపై ఫోరెన్సిక్ రిపోర్టు ఎక్కడ? – మాజీ ఎంపీ భరత్

0

పాల కల్తీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను మార్గాని భరత్ రామ్ పరామర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఆయన బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. ఘటన జరిగి పది రోజులు దాటినా నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు వెలువడకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
50వ వార్డులో ఐదుగురు మృతి చెందినట్లు, సుమారు 15 మంది నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో 11 మంది వెంటిలేటర్‌పై ప్రాణాల కోసం పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి హృదయ విదారకమని, తల్లిదండ్రుల ఆక్రందనలు గుండెలు పిండేస్తున్నాయని అన్నారు.
కనకరత్నం సహా రాజానగరం నియోజకవర్గానికి చెందిన మహిళ పేరు నష్టపరిహార జాబితాలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం తూతూ మంత్రంగా ఉందని విమర్శించారు. మృతుల కుటుంబాలకు తలా రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
“పాలల్లో అసలు ఏమి కలిసింది? బాధితులకు ఏ విధమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు? భవిష్యత్తులో చిన్నారుల ఆరోగ్యానికి ఎలాంటి భరోసా?” అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. వైద్య శాఖ మంత్రి, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు.
ప్రభుత్వం మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి పారదర్శకంగా నివేదికలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధితులకు పూర్తి న్యాయం చేయాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version