Home Politics Andhra Pradesh తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోము… ఉపేక్షించబోము

తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోము… ఉపేక్షించబోము

0

పాల కల్తీపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎవరైనా నిర్లక్ష్యం ప్రదర్శించినా, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి నాయకులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు.
300కు పైగా శాంపిళ్లు సేకరణ
పాల కల్తీ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో 300కు పైగా పాల శాంపిళ్లు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిపుణుల పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు.
బాధితులకు మెరుగైన వైద్యం
రెయిన్‌బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడిందని, డెల్టా ఆసుపత్రిలో ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తెలిపారు. కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఎనిమిది మందిలో నలుగురి పరిస్థితి స్థిరంగా ఉందన్నారు. అవసరమైన వైద్య పరికరాలను హైదరాబాద్ కిమ్స్ నుంచి రప్పించామని వివరించారు.
సీఎం ఆదేశాలు స్పష్టం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య సేవల్లో ఎలాంటి లోపం ఉండకూడదని ఆదేశాలు జారీచేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు.
నష్టపరిహారం – పూర్తి వైద్య ఖర్చులు భారం ప్రభుత్వానిదే
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇప్పటికే అందజేశామని తెలిపారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.
నిందితుడికి రిమాండ్ – టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు
పాల కల్తీకి కారణమైన నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో ప్రత్యేక టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రారంభ దశలో సరైన స్పందన లేకపోవడంతో జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై వేటు వేసిన విషయాన్ని ధృవీకరించారు.
అనంతరం నగరంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవడమే తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version