Home Politics Andhra Pradesh 24 నుంచి విశాఖ ఉత్సవ్ , సాగరం నుంచి శిఖరం వరకు పేరుతో ధీమ్

24 నుంచి విశాఖ ఉత్సవ్ , సాగరం నుంచి శిఖరం వరకు పేరుతో ధీమ్

0

విశాఖతో పాటు అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోనూ ఉత్సవాలు,మూడు జిల్లాల వ్యాప్తంగా 20 వేదికల్లో 500కు పైగా ప్రదర్శనలు,రూ. 500 కోట్ల ఆర్థికాభివృద్ధి, 3000 మందికి ఉపాధి లక్ష్యం,విశాఖలో ప్రారంభం – అనకాపల్లిలో ముగింపు వేడుకలు,కర్టెన్ రైజర్ కు హాజరైన మంత్రులు కందుల దుర్గేష్, అనిత, సంధ్యారాణి, డోలా , కొల్లు రవీంద్రఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ‘విశాఖ ఉత్సవ్-2026’ ను ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం విశాఖ కలెక్టరేట్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినాలో ఉత్సవాల ‘కర్టెన్ రైజర్’ కార్యక్రమాన్ని మంత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, డోలా బాలవీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను విశ్వవ్యాప్తం చేసేలా నిర్వహించే ఈ ఉత్సవాలకు ప్రజలందరూ కుటుంబ సమేతంగా హాజరై జయప్రదం చేయాలని మంత్రులు కోరారు. ఈ సారి విశాఖ ఉత్సవ్‌ను కేవలం విశాఖ నగరానికే పరిమితం చేయకుండా, పొరుగున ఉన్న అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ ఏకకాలంలో నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. ఈ ఉత్సవాల ప్రారంభ వేడుకలు విశాఖపట్నం లో వైభవంగా మొదలవుతాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకల ముగింపు సభను అనకాపల్లి జిల్లాలో నిర్వహించనున్నామన్నారు.ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉత్సవాలను ప్లాన్ చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇస్తూనే, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. వివిధ శాఖల సమన్వయంతో భద్రత, రవాణా, సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఈ ఏడాది విశాఖ ఉత్సవ్‌ను ఒక జిల్లాకు పరిమితం చేయకుండా విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలను కలుపుతూ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మూడు జిల్లాల్లోని 20 ప్రధాన కేంద్రాలలో 500కు పైగా సాంస్కృతిక, పర్యాటక కార్యక్రమాలు జరగనున్నాయని వెల్లడించారు.ఈ ఉత్సవాల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో దాదాపు రూ. 500 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని, తద్వారా స్థానిక యువతకు, కళాకారులకు సుమారు 3000 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో కుంటుపడ్డ పర్యాటక రంగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కించిందని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం గ్లోబల్ కోస్టల్ ఎకాలజీకి వేదికగా, అనకాపల్లి సంస్కృతి, రుచికరమైన వంటకాలు మరియు ఎంఎస్ఎంఈలకు చిరునామాగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో గిరిజన సంస్కృతి, ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా ఈ ఉత్సవాలు సాగుతాయని తెలిపారు.సీ టూ స్కై స్లోగన్ తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విశాఖ, అనకాపల్లి, అరకు తదితర ప్రాంతాలనుద్దేశించి సాగరం నుండి కొండ శిఖరాల వరకు ఈ వేడుకలు జరుగుతాయన్నారు.అద్భుతమైన ప్రకృతి రమణీయత కలిగిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, దానికి విశాఖ ఉత్సవ్ అని పేరు నిర్ణయించడం ఆనందంగా ఉందన్నారు.ఇటీవల విజయవాడలో దసరా ఉత్సవ్, సంస్కృతి, సాహిత్యం, సినిమా, నృత్యానికి సంబంధించి ఆవకాయ- అమరావతి ఫెస్టివల్ నిర్వహించామని గుర్తుచేశారు.మైసూరు, కలకత్తాలో జరిగే దసరా ఉత్సవాలను మించి విజయవాడ ఉత్సవ్ ను, ఆ తర్వాత గండికోట ఉత్సవ్, ఫ్లెమింగో ఫెస్టివల్ ను నిర్వహించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం పర్యాటక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉత్సవ వాతావరణం కనిపిస్తుందంటే అందుకు కారణం పరిపాలన దక్షుడైన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర సహకారం వల్లనే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పరుగులు పెడుతోందన్నారు. సంతృప్త స్థాయిలో అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలు ప్రతి కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొంటున్నారని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో పర్యావరణం, పర్యాటకం, కళలు, సంస్కృతి కుంటుపడ్డాయని కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని తిరిగి పట్టాలెక్కించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ క్రమంలో ఉగాది పురస్కారాలు, కందుకూరి పురస్కారాలు ప్రదానం చేసి కళలను, కళాకారులను గౌరవించామన్నారు. త్వరలోనే నంది అవార్డులు అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక పద్ధతిలో ముందుకు వెళ్తుందన్నారు.విశాఖ ఉత్సవ్ ద్వారా పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. స్థానిక కళాకారులను, కళలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లను ఆకర్షించి ఏడాదిన్నర కాలంలో వేలాది కోట్ల పర్యాటక పెట్టుబడులు సాధించామన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోనసీమ ప్రాంతాలను వివిధ రకాల టూరిజం హబ్ లుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఒక వేడుకగా, ఈవెంట్ గా చూడొద్దని అభివృద్ధికి, అనుభూతికి సూచికగా భావించాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యాటక రంగం వృద్ధి చెందాలని, స్థానికులకు, కళాకారులకు ఉపాధి అవకాశాలు కలగాలని ఆకాంక్షించారు. మీడియా ప్రతినిధుల సృజనాత్మకతకు ఇలాంటి కార్యక్రమాలు దర్పణం పడతాయని, ప్రపంచానికి ఈ కార్యక్రమాలు చూపించే బాధ్యతను తీసుకోవాలని కోరారు. యువత పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని , తద్వారా భవిష్యత్ లో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ప్రజలందరూ కుటుంబ సమేతంగా విశాఖ ఉత్సవ్ కు హాజరై మంచి అనుభూతిని పొందాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉత్సవ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు,మీడియా ప్రతినిధుల భాగస్వామ్యంతో విశాఖ ఉత్సవ్ విజయవంతం అవుతుందన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version