Home Politics Andhra Pradesh నేడు “విశాఖ ఎకనామిక్ రీజియన్ నీటి భద్రత సదస్సు”.

నేడు “విశాఖ ఎకనామిక్ రీజియన్ నీటి భద్రత సదస్సు”.

0

సీఎం, మున్సిపల్ మంత్రి మార్గదర్శకత్వంలో జీవీఎంసీ నిర్వహణ.

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.

విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కోసం రూపొందించనున్న నీటి భద్రత ప్రణాళికపై అంతర్జాతీయ స్థాయి సదస్సు మార్చి 10న విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం తెలిపారు. ఈ సదస్సు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా ” పి. నారాయణ మార్గదర్శకత్వంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోందన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగపూర్ వాటర్ సెంటర్ , పబ్లిక్ యుటిలిటీస్ బోర్డు – సింగపూర్, ఇన్‌స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్స్ – ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
విశాఖపట్నం ఎకనామిక్ రీజీయన్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో పెరుగుతున్న నీటి అవసరాలను అంచనా వేసి, నీటి వనరుల సమర్థవంతమైన వినియోగం, స్థిరమైన సరఫరా వ్యూహాలు, సమగ్ర నిర్వహణ పద్ధతులపై చర్చించేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని తెలిపారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్‌ను భవిష్యత్తులో ఒక ప్రధాన గ్లోబల్ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నివాస, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చడానికి సమగ్ర నీటి భద్రత ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు.
ఈ సదస్సులో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు మరియు అంతర్జాతీయ నిపుణులు పాల్గొని నీటి డిమాండ్ అంచనాలు, సరఫరా పెంపు చర్యలు, వృత్తాకార నీటి ఆర్థిక విధానాలు, నీటి రంగంలో పెట్టుబడి ప్రణాళిక తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సింగపూర్ సహా పలు దేశాలలో అమలులో ఉన్న ప్రపంచ స్థాయి నీటి నిర్వహణ పద్ధతులను పంచుకోవడంతో పాటు, పారిశ్రామిక నీటి వినియోగదారులు మరియు ప్రభుత్వ విభాగాల మధ్య చర్చల కోసం ఇండస్ట్రీ రౌండ్ టేబుల్ కూడా నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఈ సమావేశంలో నీటిపారుదల, పరిశ్రమలు, ఏపీఐఐసీ, గ్రామీణ నీటి సరఫరా, పట్టణాభివృద్ధి, పర్యావరణం, భూగర్భజలాలు తదితర విభాగాల అధికారులు పాల్గొననున్నారని కమిషనర్ తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version