జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ సమ సమాజ నిర్మాణానికి తన జీవితాన్నే అంకితం చేసిన మహానుభావుడు, తత్వవేత్త మహయోగి వేమన జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ యోగివేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేమన చెప్పిన 108 శతక పద్యాల సారాంశం ఒక్క వాక్యంలో “మనిషి మారితే సమాజం మారుతుంది” అని పేర్కొన్నారు.
మూఢనమ్మకాలకు యువత బానిస కాకూడదని, భయంతో కాదు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వేమన బోధించిన సామాజిక న్యాయం ఇదేనని అన్నారు. వేమన దృష్టిలో సంపదకంటే సద్గుణమే నిజమైన సంపదని, స్త్రీలను అణగదొక్కే సమాజాన్ని ఆయన తీవ్రంగా ఖండించారని గుర్తుచేశారు.
ఈ జయంతి సందర్భంగా కులవివక్షను వ్యతిరేకించడం, అంధవిశ్వాసాలను తిరస్కరించడం, స్త్రీ గౌరవాన్ని కాపాడడం, అవినీతికి దూరంగా ఉండడం వంటి సంకల్పాలు యువత చేయాలని ఎస్పీ సూచించారు. ఇదే వేమనకు నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ (ఎస్‌బీ) బి. రామకృష్ణతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
