నగర ప్రజల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు సామాజిక ఆనందాన్ని పెంపొందించే ఉద్దేశంతో “హ్యాపీ సండే” కార్యక్రమాన్ని పునరుద్ధరించినట్లు రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆదివారం ఏకేసీ కాలేజీ రోడ్డులోని నందమూరి తారక రామారావు పార్క్ (హ్యాపీ స్ట్రీట్ పార్క్) వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై యువతను ఉద్దేశించి ప్రసంగించారు. వేగంగా మారుతున్న జీవనశైలిలో ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో సానుకూల దృక్పథం, సామాజిక అనుబంధం పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతి నెల 2వ, 4వ ఆదివారాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు హ్యాపీ సండే కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఈ సందర్భంగా 5కే వాక్, జుంబా వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భవిష్యత్తులో యోగా, ధ్యానం, సైక్లింగ్, క్రీడా పోటీలు, సంగీతం, సాహిత్య, కళా ప్రదర్శనలు కూడా నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి రోజూ కనీసం ఐదు వేల అడుగులు నడక అలవాటు చేసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి తగ్గుతుందని, శరీర బరువు నియంత్రణలో ఉంటుందని తెలిపారు. క్రమం తప్పకుండా నడక చేయడం మానసిక ఉల్లాసాన్ని పెంచుతుందని చెప్పారు.
అన్ని వయసుల వారు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా హ్యాపీ సండే నిలుస్తుందని, జిల్లా యంత్రాంగం తరపున సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటుడు భద్రం, ఆర్‌ఎంసీ ఉద్యోగులు, వాకర్స్ & స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు, చిన్నారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
