ప్రజల్లో బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనను పెంపొందించడమే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
సోమవారం కలెక్టరేట్‌లో ఆర్‌బీఐ రూపొందించిన ఆర్థిక అవగాహన పోస్టర్లను జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలంటే ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమన్నారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొదుపు అలవాట్ల పెంపకం, ఆర్థిక మోసాల నుంచి రక్షణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన అవసరమని స్పష్టం చేశారు.
వారోత్సవం సందర్భంగా బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ లావాదేవీల భద్రత వంటి అంశాలపై వివిధ అవగాహన శిబిరాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక అవగాహన కల్పించి, బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనను అలవర్చడమే ఈ కార్యక్రమాల ఉద్దేశమని వివరించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్, ఆర్‌ఎంసీ కమిషనర్ రాహుల్ మీనా, డీఆర్ఓ టి. సీతారాం మూర్తి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ డి.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
