Home Politics Andhra Pradesh పొర‌పాట్ల‌కు తావులేకుండా ప‌దో త‌ర‌గతి ప‌బ్లిక్ పరీక్షలు

పొర‌పాట్ల‌కు తావులేకుండా ప‌దో త‌ర‌గతి ప‌బ్లిక్ పరీక్షలు

0

స‌మీక్షలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్

మార్చిలో నిర్వహించనున్న ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో చిన్న పొరపాటుకు కూడా అవకాశం లేకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 01వ తేదీ వరకు ఉద‌యం 9.30 నుంచి 12.45 గంట‌ల వ‌ర‌కు నిర్వహించనున్న నేపథ్యంలో, జిల్లాలో ఏర్పాటు చేసిన 133 పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్ తదితర ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలని సూచించారు. ప్ర‌తి కేంద్రం వ‌ద్దా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌న్నారు. పర్యవేక్షణకు నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసి నకిలీ, అక్రమాలకు తావులేకుండా చూడాలని ఆదేశించారు. అన్ని పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రశ్నాపత్రాల భద్రత, సమాధాన పత్రాల సురక్షిత తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని, పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయాల‌ని, ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ఇదిలా ఉండ‌గా ప‌రీక్ష‌ల‌కు మొత్తం 30,633 మంది విద్యార్థులు హాజ‌రవుతున్నార‌ని పేర్కొన్నారు.

ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణకూ ప‌క్కా ఏర్పాట్లు…!

ఇంటర్మీడియట్, ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు కూడా పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు మార్చి 02 నుంచి 13వ తేదీ వ‌ర‌కు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జ‌ర‌గ‌నున్నాయ‌ని, ఈ పరీక్షలకు మొత్తం 1,247 మంది అభ్యర్థులు హాజరుకానున్నార‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఇందుకోసం 16 ప్రాథ‌మిక కేంద్రాలు, 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అలాగే ఎస్సెస్సీ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి 28వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో మొత్తం 1,141 మంది విద్యార్థులు హాజరుకానున్నార‌ని, ఇందుకోసం 16 ప్రాథ‌మిక‌ సెంటర్లు, 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు. పరీక్షల నిర్వహణకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని, సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలు, భద్రత, మౌలిక సదుపాయాలు, ఇన్విజిలేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని సూచించారు. పరీక్షలు ప్రశాంతంగా, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
స‌మావేశంలో ఇన్ఛార్జి డీఆర్వో స‌త్తిబాబు, ఏడీసీపీ అడ్మిన్ రాజ్ క‌మ‌ల్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్, డీఎం హెచ్వో జ‌గదీశ్వ‌ర‌రావు, విద్యుత్ శాఖ ఈఈ లక్ష్మ‌ణ‌రావు, ఐ&పీఆర్ డీడీ స‌దారావు, ట్రెజ‌రీ, పోస్టాఫీసు ఇత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version