టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై కలెక్టర్ అసహనం
– ఘాటు హెచ్చరికతో ప్లానింగ్ లో గుబులు
పని చేయటం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోండి.. అంతేగానీ ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించబోను అని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను ఘాటుగా హెచ్చరించారు. గత కొన్ని వారాలుగా పీజీఆర్ఎస్ లో వస్తున్న వినతులకు సరైన పరిష్కారం చూపటంలో విఫలమవుతున్న పది మంది అధికారులను సోమవారం కలెక్టరేట్ కు పిలిపించి మాట్లాడారు. రెండేసి సార్లు మెమోలు ఇచ్చినప్పటికీ ఎందుకని పనితీరు మారటం లేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపటంలో వెనుకబడడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పునరావృతం కానీయొద్దని, పునఃపరిశీలన చేసుకొని జాగ్రత్తగా పని చేయాలని, ప్రజల నుంచి అందే వినతులకు సమగ్ర స్థాయిలో, నాణ్యమైన పరిష్కారం చూపాలని హితవు పలికారు.
