రాజమండ్రి కంటిపూడి సుజుకి షోరూంలో సుజుకి సంస్థ రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వాహనం సుజుకి యాక్సెస్ ఈ ను ఆర్టీవో సురేష్ కుమార్ శుక్రవారం లాంఛనంగా ఆవిష్కరించారు. పర్యావరణహిత రవాణా వైపు వినియోగదారులను ప్రోత్సహించే దిశగా ఈ వాహనం కీలక ముందడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ వాహనం పనితీరు, భద్రత, సౌకర్యాల పరంగా వినియోగదారుల అంచనాలకు తగ్గట్టుగా ఉందన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక బ్యాటరీ మన్నిక, తక్కువ నిర్వహణ ఖర్చులు ఈ వాహనానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని వివరించారు.
కంటిపూడి సుజుకి షోరూం యాజమాన్యం ముళ్ళపూడి జగన్, కె. వినయ్ బాబు, సీహెచ్ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ, నూతన టెక్నాలజీతో కూడిన వాహనాలను సరసమైన ధరలకే వినియోగదారులకు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. వినియోగదారుల నుండి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్నిస్తోందని, సుజుకి యాక్సెస్ ఈ మార్కెట్‌లో మంచి స్థానం సంపాదిస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి సుజుకి షోరూం సిబ్బంది, ఆటోమొబైల్ రంగ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, వినియోగదారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
