Home Politics Andhra Pradesh రూ.8 లక్షల కోట్లు ఆవిరి

రూ.8 లక్షల కోట్లు ఆవిరి

0

కుప్పకూలిన స్టాక్ మార్కెట్

పశ్చిమాసియా సంక్షోభమే కారణం

పశ్చిమాసియాలో చమురు, గ్యాస్​ క్షేత్రాలపై జరుగుతున్న దాడులు, గ్లోబల్ స్థాయిలో భారీగా పెరిగిన ఇంధన ధరలు, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వెరసి గురువారం భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. వరుసగా మూడు రోజుల పాటు లాభాల్లో కొనసాగిన సూచీలు అంతర్జాతీయ ప్రతికూలత ధాటికి కుప్పకూలాయి. సెన్సెక్స్​ 2,500 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్లపైగా పడిపోయాయి. దీంతో గురువారం ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లకుపైగా సంపద ఆవిరి అయ్యింది. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 2,580 పాయింట్ల నష్టపోయి 74,123 వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ 808 పాయింట్లు కోల్పోయి 22,972 వద్ద వద్ద ట్రేడ్ అవుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 116 డాలర్లకు చేరుకుంది. క్రూడ్ ఆయిల్ విషయంలో భారత్ దిగుమతులపైనే ఆధారపడి ఉంది. దీంతో భారతీయ మార్కెట్​పై ఆ సెంటిమెంట్ భారీగా పడింది. మరోవైపు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చైర్మన్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో ఆ బ్యాంక్ షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయి. అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. అమెరికా డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 49 పైసలు కోల్పోయి 92.89 వద్ద కొనసాగుతోంది.

మరోవైపు అమెరికా మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఆ ప్రభావం గురువారం ఉదయం ఆసియా మార్కెట్లపై పడింది. దీంతో ఆసియా మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్సీ 1.55శాతం, జపాన్​కు చెందిన నిక్కీ 2.18శాతం , షాంఘైకు చెందిన ఎస్​ఎస్​ఈ కాంపోజిట్​ ఇండెక్స్​, హాంకాంగ్​కు చెందిన హాంగ్​ సెంగ్​ ఇండెక్స్​ సూచీ 1.68 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. నాస్​డాక్ మినహా మిగతా అన్ని సూచీలు పడిపోయాయి. ఇదే సమయంలో ఇరాన్ – అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరిచుకుంటున్నారు. బుధవారం ఒక్కరోజే రూ. 2,714.35 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మంగళవారం రూ.4,741 కోట్లు, సోమవారం రూ.9వేల కోట్లకు పైగా, శుక్రవారం అత్యధికంగా రూ.10వేల కోట్లకు పైగా విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరిగాయని అమెరికా ఫెడ్​ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ నిర్ణయం ప్రభావంతో అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఆ ప్రభావం గురువారం ఆసియా మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది.

ఇటీవల మూడు రోజులుగా మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో సూచీలు లాభాల్లో కొనసాగినప్పటికీ, గురువారం ట్రేడింగ్‌లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కూడా మార్కెట్ల పతనానికి కారణమైంది. దీంతో ప్రీ ట్రేడింగ్​లోనే సెన్సెక్స్​ 1900 పాయింట్లపైగా క్షించింది. ప్రస్తుతం 2వేల పాయింట్ల పైగానే పడిపోాయాయి. ఇక ఖతార్​ ఆర్థికవ్యవస్థకు పునాది అయిన రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. దాడితో ఈ ప్రాంతానికి భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు భారత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎరువులు, సీఎన్‌జీ, పీఎన్‌జీ అవసరాల కోసం భారత్ ఈ గ్యాస్ సరఫరాపై ఆధారపడుతోంది. భారత్ దిగుమతి చేసుకునే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌లో దాదాపు 47 శాతం ఖతార్ నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version