తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల విలీనమైన పోలీస్ స్టేషన్ల పనితీరును సమీక్షిస్తూ జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపేట టౌన్, మండపేట రూరల్, అంగర, రాయవరం పోలీస్ స్టేషన్లను సందర్శించి రికార్డులు, పరిసరాల పరిశుభ్రత, సీసీ కెమెరాల పనితీరు, నమోదైన కేసుల స్థితిగతులను పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతిపై అధికారులతో ఆరా తీసి, అవసరమైన సూచనలు జారీ చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేసిన ఎస్పీ, సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో ప్రత్యేకంగా సమావేశమై లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై సమీక్షించారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ప్రజలకు భద్రతాభావం కల్పించాలన్నారు. రికార్డులన్నీ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (CCTNS) పోర్టల్‌లో సమయానికి నవీకరించాలని ఆదేశించారు.
సబ్ డివిజన్ పరిధిలో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో డ్రోన్ సర్వైలెన్స్ విస్తరించాలని, ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడంతో పాటు, విలేజ్ విజిట్స్, పల్లె నిద్రలను తప్పనిసరిగా చేపట్టాలని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు బలోపేతం చేయాలని ఆదేశించారు.
రాత్రి గస్తీని ముమ్మరం చేసి, అనుమానితుల వేలిముద్రలను ఎంఎస్‌సీడీ పరికరాల ద్వారా పరిశీలించాలని పేర్కొన్నారు. ఈ తనిఖీలలో డీఎస్పీ (ఈస్ట్ జోన్) బి. విద్య, మండపేట టౌన్ ఇన్స్పెక్టర్ డి. సురేష్, మండపేట రూరల్ ఇన్స్పెక్టర్ దొర రాజు, సబ్ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
