Friday, May 1, 2026
HomeNewsహోరాహోరీ..!

హోరాహోరీ..!

తమిళనాట ఆసక్తికర పోరు

డీఎంకే, ఏఐడీఎంకే మధ్య పోటాపోటీ

సత్తా చాటనున్న టీవీకే విజయ్

ప్రీ పోల్ సర్వేలలో వెల్లడి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఇప్పటికే పార్టీలన్నీ కూడా నామినేషన్లు దాఖలు చేయడం, అభ్యర్థుల ప్రకటన, ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఏప్రిల్ 23న ఒకే దఫాలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే పార్టీ ఏది అనే దానిపై రెండు ప్రీ పోల్ సర్వేలు ఆసక్తికర నివేదికలు వెల్లడించాయి. ఈ పోల్ సర్వేల్లో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఎన్నికలకు ముందు కొత్త పార్టీ పెట్టి.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలోకి దిగిన విజయ్ పార్టీ అనూహ్య రీతిలో ఓట్లు సాధిస్తుందని ప్రీ పోల్ సర్వేలు వెల్లడించాయి. లోక్ పోల్ నిర్వహించిన సర్వే ప్రకారం, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని కూటమి.. 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి.. 181-189 సీట్లు గెలుచుకునే అవకాశముందని వెల్లడించింది. అలాగే ఈ కూటమికి 40.1 శాతం ఓటు షేరు లభించనుందని సర్వే వెల్లడించింది. విపక్ష ఏఐఏడీఎంకే కూటమి (ఎన్‌డీఏ) 38 నుంచి 42 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, దీనికి 29 శాతం ఓటు షేరు వస్తుందని సర్వే అంచనా వేసింది. ఈ సర్వే మార్చి 1 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించబడింది. ఇదిలా ఉంటే నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం తొలి ఎన్నికల్లోనే మంచి ఓటు శాతం సాధిస్తుందని.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 8-10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని.. ఈ పార్టీకి 23.9 శాతం ఓటు షేరు రావచ్చని సర్వే అంచనా వేసింది. ఎన్‌టీకే, ఇతర పార్టీలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని, వాటి ఓటు శాతం వరుసగా 4.9 శాతం, 2.1 శాతంగా ఉంటుందని సర్వే తెలిపింది.

ఈ సర్వే ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎక్కువ మంది ప్రజలు ఎంకే స్టాలిన్‌ను కోరుకుంటున్నారు. ఆయన తర్వాత స్థానాల్లో విజయ్, పళనిస్వామి ఉన్నారు. డీఎంకే కూటమికి ప్రధాన బలం వారి సంక్షేమ పథకాలేనని సర్వే తెలిపింది. ముఖ్యంగా “కళైగ్నర్ మహిళా ఉరిమై తొగై”, ఉచిత బస్ ప్రయాణం, బ్రేక్‌ఫాస్ట్ పథకాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో మంచి ఆదరణ పొందాయని సర్వే వెల్లడించింది. విజయ్ పార్టీకి యువత, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారు, మరియు ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నవారి నుంచి మంచి మద్దతు లభిస్తుందని.. అయితే ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఒంటరిగా బరిలో దిగడం వల్ల ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదని సర్వేలు తేల్చాయి. ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఈ ఓట్లు ఎక్కువ సీట్లుగా మారకపోవచ్చని సర్వే తెలిపింది. మరో సర్వే ‘పోల్ ట్రాకర్’ కూడా.. డీఎంకే కూటమి భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం డీఎంకే కూటమి 172-178 సీట్లు గెలుచుకుని, 42.7 శాతం ఓటు షేరు సాధించవచ్చని అంచనా వేస్తోంది. అలాగే ఏఐఏడీఎంకే మాత్రం 46-52 సీట్లకు పరిమితమయ్యే అవకాశముందని.. అలాగే టీవీకే పార్టీకి 19.2 శాతం ఓటు షేరు లభించి 6-12 సీట్లు రావచ్చని వెల్లడించింది. ఎన్టీకే కు 0-2 సీట్లు, సుమారు 5.1 శాతం ఓటు షేరు లభించవచ్చని అంచనా. ప్రజల దృష్టిలో ఎంకే స్టాలిన్ అనుభవజ్ఞుడైన నాయకుడిగా కనిపిస్తున్నారని పోల్ ట్రాకర్ సర్వే వెల్లడించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments