1100 టోల్ ఫ్రీ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
– కలెక్టర్ కీర్తి చేకూరి
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తదుపరి రోజైన ఫిబ్రవరి 16న రాష్ట్ర ప్రభుత్వం ఐచ్చిక సెలవు ప్రకటించిన నేపథ్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ (ప్రజా గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్) / రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ పేర్కొంటూ, ఫిబ్రవరి 16న కార్యాలయాలకు వచ్చి ఫిర్యాదులు అందజేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తదుపరి సోమవారం నుంచి పీజీఆర్ఎస్ / రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1100 టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌ను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఫిర్యాదులను 1100 నంబర్‌కు ఫోన్ చేసి నమోదు చేసుకోవచ్చని, అలాగే నమోదు చేసిన అర్జీల పరిష్కార స్థితిని కూడా తెలుసుకునే అవకాశం ఉందని వివరించారు.
అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 95523 00009 ద్వారా సత్వర పౌర సేవలు పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ ప్రత్యామ్నాయ సేవలను వినియోగించుకొని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కోరారు.
