Wednesday, April 29, 2026
HomeNewsమధ్యవర్తులతో కాదు...నేరుగా నాతో మాట్లాడండి...!

మధ్యవర్తులతో కాదు…నేరుగా నాతో మాట్లాడండి…!

– అత్యవసరమైతే ఎప్పుడైనా సంప్రదించండి
– లేకుంటే నేనే రంగంలోకి దిగుతా
– ప్రజల నుంచి ప్రతికూలత రాకుండా సమస్యలు పరిష్కరించండి
– అధికారులంతా ప్రణాళికా బృందంగా పనిచేయాలి
– డీడీఆర్‌సీ సమీక్షలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ కీలక వ్యాఖ్యలు

విశాఖకు ప్రపంచ వ్యాప్తంగా కీర్తి, ప్రతిష్టలు ఉన్నాయని.. ఆ ఖ్యాతి, పేరుకు తగ్గట్టుగానే వినూత్న రీతిలో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని, ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ జిల్లా అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదల, విభాగాల సమన్వయంపై కలెక్టరేట్ మీటింగు హాలులో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆయన కీలక సూచనలు చేశారు. జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఎఫ్వో రవీందర్ ధామతో కలిసి ఆయన వివిధ అంశాలపై కూలంకషంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలు, ప్రతి విభాగం తన పరిధిలోని సమాచారం, సమస్యలు, పురోగతిని అధికారులు నేరుగా తనకు తెలియజేయాలని, మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా కమ్యూనికేషన్ కొనసాగించాలని, అవసరమైతే ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో 100కు పైగా పథకాలు అమలవుతున్న నేపథ్యంలో, ప్రతి అధికారి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అధికారుల పని సమయాన్ని 40శాతం సాధారణ ప్రాజెక్టులకు, పనులకు 60శాతం జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, వినూత్న ప్రాజెక్టులు చేపట్టేందుకు కేటాయించాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యతే మనందరి ప్రాధాన్యత కావాలని, దాని కనుగుణంగా పని చేయాలని హితవు పలికారు. ప్రభుత్వం ఆశించే ఫలితాలను ముందుగానే అంచనా వేసి సిద్ధంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను నిరంతరం గమనిస్తూ వేగంగా స్పందించాలన్నారు. విశాఖపట్నం జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైద్య రంగంలో డి.ఎం.హెచ్.ఓ, ఎన్‌టీఆర్ వైద్య సేవా కోఆర్డినేటర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, డ్రగ్ కంట్రోలర్, ఫుడ్ సేఫ్టీ విభాగాల మధ్య సమన్వయం పెంపొందించాలని ఆదేశించారు. ప్రజల్లో విశాఖపట్నంపై సానుకూల అభిప్రాయాన్ని పెంచే విధంగా అధికారులు పనిచేయాలని హితవు పలికారు.
ప్రతి అధికారి తమ విభాగ పనితీరుపై వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని కలెక్టర్ చెప్పారు. ప్రజల నుంచి ప్రతికూల స్పందన రాకుండా ప్రతి ఫిర్యాదును సమయానికి పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే తానే స్వయంగా సమస్యల పరిష్కారానికి రంగంలోకి దిగుతానని ఈ క్రమంలో హెచ్చరించారు. లబ్ధిదారుల ఆధారిత పథకాల అమలులో బ్యాంక్ లింకేజీని పెంచేందుకు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ తో సమన్వయం చేసుకోవాలన్నారు. పరిశ్రమలు, వ్యవస్థాపకతకు ప్రోత్సాహం కల్పించే పథకాల గురించి, ప్రభుత్వం కల్పించే రాయితీల గురించి అవగాహన కల్పించాలన్నారు. పర్యాటక, రెవెన్యూ, సివిల్ సప్లైస్, డిజిటల్ సేవలు, మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం వంటి అన్ని రంగాల్లో సమన్వయంతో పనిచేస్తూ, పారదర్శకత, సమర్థతతో ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సచివాలయాల ప్రాధాన్యతను గుర్తించి సేవలను విస్తృతం చేయాలన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకునే విధంగా హైదరాబాద్, బెంగళూరులలో మాదిరిగా విశాఖ నుంచి కనెక్టవిటీ ఏసీ బస్సు సర్వీసులను నడపాలని, దానికి అవసరమైన అధ్యయనం చేసి నివేదించాలని ఆర్టీసీ ఆర్.ఎం.ను ఆదేశించారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రతిపాదించిన రైతు బజారు ఏర్పాటు విషయంలో సంబంధిత అధికారులు చొరవ చూపాలని సూచించారు. అధికారులందరూ ఒక బృందంగా కలిసి ప్రణాళికాబద్ధంగా, వేగవంతంగా పనిచేసి విశాఖపట్నం జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, అన్ని విభాగాల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments