Home Editorials స్టూడెంట్స్ కు మాక్ అసెంబ్లీ

స్టూడెంట్స్ కు మాక్ అసెంబ్లీ

0
  • స్టూడెంట్స్ కు మాక్ అసెంబ్లీ నేడు
  • రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహణ
  • అభినందనలు తెలిపిన మంత్రి లోకేశ్
  • (అమరావతి, జయజయహే)

పిల్లలో రాజకీయాలపై అవగాహన కల్పిస్తూ సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన కల్పించేందుకు రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో పిల్లలతో మాక్ అసెంబ్లీని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడిలా మారి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు. ఈ చర్చల్లో రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే అంశాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తూ ఓ వర్గం విద్యార్థులు మాట్లాడగా, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై మరో వర్గం విద్యార్థులు మాట్లాడుతారు. ఈ సందర్భంగా జరిగే చర్చలు అచ్చం అసెంబ్లీని తలపించే విధంగా ఉంటాయి. అమరావతిలో నవంబరు 26న నిర్వహించే విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ పోటీల్లో మంగళగిరి విద్యార్థిని శ్రీకనకపుట్లమ్మ ఎంపికైంది. ఈ సందర్భంగా మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థినిని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఉండవల్లి నివాసానికి సదరు విద్యార్థినితో పాటు కుటుంబ సభ్యులను పిలిపించుకుని ఆయన మాట్లాడారు. 8వ తరగతి చదువుతున్న శ్రీకనకపుట్లమ్మ వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి మాక్ అసెంబ్లీకి ఎంపికయ్యింది. ఈ సందర్బంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచేందుకు కృషి చేస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమన్నారు. రాజ్యాంగ దినోత్సవం రోజున విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహణకు సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని మంత్రి లోకేశ్ గుర్తు చేశారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఏడాది స్టూడెంట్ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు. వారిని చూసి మరో పదిమంది విద్యార్థులు స్ఫూర్తి పొందుతారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మంగళగిరి నియోజకవర్గం తన కుటుంబంలా మారిపోయిందని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విద్యార్థిని కుటుంబ యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి 11వ వార్డులో నివాసం ఉండే విద్యార్థిని తండ్రి రాము పుట్టుకతో దివ్యాంగుడు. ట్రై స్కూటిపై కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. విద్యార్థిని శ్రీ కనకపుట్లమ్మ భవిష్యత్​లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. మంత్రిని కలవడం పట్ల విద్యార్థిని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతిలో బుధవారం న నిర్వహించనున్న విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ, రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కసరత్తును పూర్తి చేసింది. అక్టోబరు 21, 22 తేదీల్లో పాఠశాల స్థాయిలో 6-8 తరగతుల విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస, క్విజ్‌ పోటీలు నిర్వహించింది. వీరిలో ఆరుగురు చొప్పున మండల స్థాయిలో అక్టోబరు 24, 25 నిర్వహించే పోటీలకు ఎంపిక అయ్యారు. అనంతరం మండల స్థాయి నుంచి ఆరుగురు చొప్పున అదే నెల 29, 30 తేదీల్లో నిర్వహించే నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. చివరికి నియోజకవర్గాల నుంచి రాష్ట్ర స్థాయి విద్యార్థుల అసెంబ్లీ పోటీలకు 175 మందిని ఎంపిక అయ్యారు. నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేలా విద్యార్థులను ఎంపిక చేసి, అమరావతికి తీసుకొస్తారు. బుధవారం శాసనసభలో మాక్‌ అసెంబ్లీ నిర్వహిస్తారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version