తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాల ఘటనతో అనారోగ్యానికి గురైన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ మంగళవారం బొల్లినేని ఆసుపత్రిలో పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు ప్రాణాలతో పోరాడుతుంటే రాష్ట్ర మంత్రులు మాత్రం రాజకీయ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్‌లకు రాజకీయ ప్రదర్శనలు చేయడానికి సమయం ఉంది కానీ కల్తీ పాల బాధితులను పరామర్శించే మనసు లేదని విమర్శించారు.
ఈ ఘటనను సాధారణ ప్రమాదంగా చూపించి దాన్ని చిన్నచూపు చూసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. నిజానిజాలు బయటపడాలంటే ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
160 లీటర్ల పాలు పంపిణీ చేసినప్పటికీ కేవలం 20 కుటుంబాలకే ఎందుకు ప్రభావం పడిందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. పాలలో యూరియా కలిసిందా, ఫార్మాలిన్ కలిసిందా, లేక ఎవరో ఉద్దేశపూర్వకంగా పురుగుల మందు కలిపారా అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది అని చెప్పారు.
బాధిత కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, చిన్నారులు కూడా ప్రాణాలతో పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ కుటుంబాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే కూడా ఇదే విధంగా వ్యవహరిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో వైఎస్ జగన్ మిల్క్ ప్రొక్యూర్‌మెంట్ యాక్ట్ తీసుకువచ్చిందని, ఆ చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భరత్ విమర్శించారు. ల్యాబ్ రిపోర్టులు రావడానికి వారాలు పడటం వెనుక ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని అన్నారు.
ఈ ఘటన తర్వాత హెరిటేజ్ సంస్థ ప్రకటనలు విపరీతంగా పెరగడం అనుమానాలకు తావిస్తున్నదని, ప్రజల ప్రాణాలతో జరిగిన ఘటనను కూడా వ్యాపారంగా మార్చుకోవడం దారుణమని ఆయన మండిపడ్డారు.
బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, ఈ ఘటనపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. తనిఖీల గురించి అడిగితే ఫుడ్ సేఫ్టీ అధికారులు సిబ్బంది లేరని చెప్పడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
