Home Politics Andhra Pradesh జేఎన్టీయూకేలో మంత్రి లోకేష్ సందడి

జేఎన్టీయూకేలో మంత్రి లోకేష్ సందడి

0

విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్ భవనాలు రోడ్లు ప్రారంభం స్థానిక జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖమంత్రి నారా లోకేష్ శుక్రవారం సందర్శించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమంలో మంత్రి విద్యార్థులతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు, ఆకాంక్షలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్ నాయకులని, ఆవిష్కర్తలని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా స్పష్టమైన లక్ష్యాలు, నూతన ఆలోచనలు, ఇన్నోవేషన్, స్టార్టప్ సంస్కృతి వైపు దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతిభను ప్రోత్సహించేందుకు అవసరమైన మౌలిక నదుపాయాలు, పరిశ్రమలతో అనుసంధానం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో నంబర్ వన్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యంగా వ్యవసాయం, ఆక్వా పరిశ్రమలు, టెక్నాలజీ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రం దేశానికి ఆహార ధాన్యాల గోదాముగా గుర్తింపు పొందుతోందని, గోదావరి ప్రాంతం రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా నిలుస్తుందని అన్నారు. జేఎన్టీయూకేలో గ్రీన్ హైడ్రోజన్, ఆక్వా టెక్నాలజీ, పెట్రోలియం, ఆఫ్షోర్ టెక్నాలజీ, క్వాంటం టెక్నాలజీ వంటి భవిష్యత్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కృత్రిమ మేధస్సు ప్రాధాన్యత పెరుగుతున్నప్పటికీ, అది మన ఆలోచనా శక్తికి ప్రత్యామ్నాయం కాదని, మానవ విలువలు, కుటుంబ వ్యవస్థ, సామాజిక బాధ్యతలను ఎప్పటికీ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. టెక్నాలజీని సమర్ధవంతంగా వినియోగిస్తూ సమగ్ర అభివృద్ధి సాధించాలన్నారు.
అనంతరం మంత్రి జేఎన్టీయూకే ఇన్నోవేషన్ ఫెయిర్ 2026ను సందర్శించారు. ఈ ఇన్నోవేషన్ ఫెయిర్లో రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు 20 వినూత్న విద్యార్ధి ప్రాజెక్టులు ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు సమాజ అవసరాలకు అనుగుణంగా, వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే స్థాయిలో ఉండటం ఆనందకరమని పేర్కొన్నారు. జేఎన్టీయూకే ఇన్నోవేషన్ ఫెయిర్ వంటి వేదికలు యువత సృజనాత్మకతను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి ఇన్నోవేషన్ వేదికలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తదుపరి యూనివర్శిటీలో నూతనంగా నిర్మించిన నందనం హాస్టల్ భవనం, సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపకులపతి సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, రెక్టార్ పి. సుబ్బారావు, రిజిస్ట్రార్ ఆర్. శ్రీనివాసరావు, ఓఎస్డీ కోటేశ్వరరావు, డైరెక్టర్లు, యుసిఇకె ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, అధ్యాపకులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version