Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshయువ న్యాయవాది హత్యపై న్యాయవాదుల ఆందోళన

యువ న్యాయవాది హత్యపై న్యాయవాదుల ఆందోళన

అన్నమయ్య జిల్లాలో యువ న్యాయవాది పూజారి ఎల్లయ్య హత్య ఘటనపై న్యాయవాదుల వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విధి నిర్వహణలో ఉన్న సమయంలో జరిగిన ఈ దారుణ ఘటనను రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ ఖండిస్తూ, న్యాయవాదుల భద్రతపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో గురువారం బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణం వెలుపల మానవహారం ఏర్పాటు చేసి, న్యాయవాది ఎల్లయ్యకు నివాళులు అర్పిస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గళమెత్తారు. న్యాయవాదులపై పెరుగుతున్న దాడులను అరికట్టకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.వి. ప్రసాద్ మాట్లాడుతూ, న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని అన్నారు. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులు సురక్షితంగా లేకపోవడం విచారకరమని, పూజారి ఎల్లయ్య హత్య సంఘటన దీనికి స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, దుండగులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్యదర్శి శ్రపెళ్ళూరి రమేష్ మాట్లాడుతూ, న్యాయవాదుల భద్రతను నిర్లక్ష్యం చేయడం తగదని, ప్రభుత్వం దీనిపై స్పష్టమైన విధానం రూపొందించాలని సూచించారు. కోశాధికారి దాసరి అమ్ములు మాట్లాడుతూ, ఈ ఘటనతో న్యాయవాదుల్లో భయం నెలకొన్నదని, భద్రత కల్పించాల్సిన అవసరం అత్యవసరమని తెలిపారు.
మహిళా ప్రతినిధి గెడి రాజేశ్వరి మాట్లాడుతూ, న్యాయవాదులపై దాడులు పెరుగుతుండటం ఆందోళనకరమని, ముఖ్యంగా మహిళా న్యాయవాదుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
ఈ నిరసనలో పాల్గొన్న ఇతర న్యాయవాదులు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల రక్షణ కోసం చట్టం తీసుకురావాలని, ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments