Home Politics Andhra Pradesh కేరళ సీఎం ఆస్తి రూ. కోటి

కేరళ సీఎం ఆస్తి రూ. కోటి

0

రూ. 45 లక్షల చరాస్తులే

అఫిడవిట్ లో పేర్కొన్న విజయ్

కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్ తనకు రూ.1 కోటికిపైగా విలువ చేసే స్థిర, చరాస్తులే ఉన్నాయని ప్రకటించారు. ఆయన గురువారం రోజు ధర్మదామ్ అసెంబ్లీ స్థానంలో సమర్పించిన నామినేషన్ పేపర్లలో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు రూ.45 లక్షలకుపైగా విలువ చేసే చరాస్తులు ఉన్నాయన్నారు. ఇందులో 80 గ్రాముల బంగారం, బ్యాంకు డిపాజిట్లు, కంపెనీల షేర్లు ఉన్నాయని తెలిపారు. కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ తనకు వాటాలు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక రూ.56 లక్షలు విలువైన స్థిరాస్థులు ఉన్నాయని విజయన్ చెప్పారు. ఇందులో ఒక ఇంటితో పాటు పథిరియాద్ అంసోమ్ గ్రామంలో 78 సెంట్ల వ్యవసాయ భూమి ఉన్నాయన్నారు. తనకు, తన భార్యకు ఎలాంటి అప్పులూ లేవని ఆయన స్పష్టం చేశారు. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో తనకు రూ.5.33 లక్షల ఆదాయం, తన భార్యకు రూ.5.77 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. 2016 నుంచి ఇప్పటివరకు, పదేళ్ల పాటు కేరళ సీఎంగా వ్యవహరించిన పినరయి విజయన్‌కు కేవలం 1 కోటి రూపాయల ఆస్తులే ఉండటం గమనార్హం. 1963లో థలస్సెరీలోని ప్రభుత్వ బ్రెన్నన్ కాలేజీలో సీఎం విజయన్ ఇంటర్ చేశారు. ఆయనపై 6 పోలీసు కేసులు ఉన్నాయి. వీటిలో ఒక అవినీతి నిరోధక చట్టం కేసు, మరొక ఈడీ కేసు ఉన్నాయి. 1995లో కేరళలోని పల్లివాసల్, సెంగులం, పన్నియర్ హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ స్టేషన్ల పునరుద్ధరణ కాంట్రాక్టును కెనడా కంపెనీ ఎస్‌ఎన్‌సీ – లావాలిన్‌కు అప్పగించారు. ఆ కాంట్రాక్టు కేటాయింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.374.5 కోట్ల నష్టం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కేరళ విద్యుత్ శాఖ మంత్రిగా వ్యవహరించిన విజయన్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ప్రస్తుతం దీనిపై తుదితీర్పు భారత సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్ దశలో ఉంది. మౌలిక వసతుల ప్రాజెక్టులకు భూసేకరణ కోసం కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్ (కేఐఐఎఫ్‌బీ) ద్వారా మసాలా బాండ్ ఫండ్స్‌ను వినియోగించారనే అభియోగాలపై ఈడీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోంది. దీనిపై విజయన్‌కు ఈడీ షోకాజ్‌ నోటీసును జారీ చేసింది. కానీ దానిపై కేరళ హైకోర్టు స్టే విధించింది.

ధర్మదామ్ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం విజయన్ పోటీచేస్తుండటం ఇది మూడోసారి. ఆయన గతంలో కుథుపారంబ స్థానం నుంచి మూడుసార్లు, తలిపారంబ స్థానం నుంచి ఒకసారి పోటీచేశారు. ధర్మదామ్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా వీపీ అబ్దుల్ రశీద్, బీజేపీ అభ్యర్ధిగా కే రంజిత్ బరిలోకి దిగారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వీపీ అబ్దుల్ రశీద్ వ్యవహరిస్తున్నారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ మార్చి 23న ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 26 వరకు ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతాయి. ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోరు జరగబోతోంది. ప్రస్తుతం సీపీఎం సారధ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) కూటమి, కాంగ్రెస్ సారధ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కూటమి బలంగా ఉన్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కూటమి కూడా బలమైన పోటీ ఇచ్చేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. కమలదళంలో రాజీవ్ చంద్రశేఖర్, వి.మురళీధరన్ లాంటి కీలక నేతలు ఉన్నారు. ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి సత్తాను చాటుకుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమకే కలిసొస్తుందనే విశ్వాసంతో ఈ కూటమి ఉంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version