Home Politics Andhra Pradesh ప్రమాణాలు లేకపోతే జరిమానా

ప్రమాణాలు లేకపోతే జరిమానా

0

ప్రమాణాలు లేకపోతే జరిమానా

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల పై హైకోర్టు

షిర్డీ సాయి సంస్థ సరఫరా చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాణాల ప్రకారం లేకపోతే జరిమానా విధిస్తామని హైకోర్టు హెచ్చరించింది. 2021 నుంచి ట్రాన్స్‌ఫార్మర్ల టెండర్‌ కేటాయింపు, సరఫరాలో అవకతవకలు జరిగాయని దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ రిటైర్డ్ ఐపీఎస్​ ఏబీ వెంకటేశ్వరరావు పిల్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కౌంటర్లు వేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. షిర్డీ సాయి సంస్థ సరఫరా చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు, పరికరాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ నిపుణులతో పరిశీలన చేయిస్తామని ధర్మాసనం పేర్కొంది. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే సంస్థకు జరిమానాలు విధిస్తామని తెలిపింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని ఏజీ కోరడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది. అలానే దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, ఏపీఎస్​పీడీసీఎస్​ సీఎండీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.

తెలంగాణ కంటే రూ.55 వేలు అధికం: ఇతర సంస్థలు టెండర్‌లో అర్హత సాధించకుండా షిర్డీ సాయికి అనుగుణంగా నిబంధనలు పెట్టారని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపించారు. తెలంగాణలో ఇదే ప్రమాణాలు ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను రూ.85 వేలకు సరఫరా చేస్తున్నారని ఏపీలో మాత్రం లక్షా 39 వేల 999 రూపాయలకు సరఫరా చేస్తున్నారని వివరించారు. ఇది తెలంగాణ కంటే రూ.55 వేలు ఎక్కువ అని కోర్టుకు తెలిపారు. టెండర్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా చేయాలని ఉంటే షిర్డీ సాయి 3 స్టార్‌ రేటింగ్‌ ఉన్నవి సరఫరా చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. షిర్డీ సాయి సంస్థ 2022 నుంచి ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా చేస్తోందని కాని ఇప్పుడు పిటిషనర్‌ అకస్మాత్తుగా పిల్‌ వేయడానికి కారణం ఏంటో చెప్పలేదని తెలిపారు. అంతే కాకుండా తన పిల్‌ విచారణకు వస్తుందంటూ ప్రచారం చేసుకున్నారని చెప్పారు. టెండర్‌ నిబంధనలకు అనుగుణంగా పరికరాలు సరఫరా చేయ లేదని పిటిషనర్‌ చెబుతున్నట్లుగా పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ పిటిషనర్‌ ఐపీఎస్‌ అధికారిగా 2024లో పదవీ విరమణ చేశారని ఈ క్రమంలో ప్రస్తుతం పిల్‌ దాఖలు చేసి ఉంటారని చెప్పింది. మంచి కారణం కోసమే పిల్‌ వేశారని ఎందుకు అనుకోకూడదని అంటూ విచారణను వాయిదా వేసింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version