Home Politics Andhra Pradesh ఎస్టీగా పుట్టడమే నేరమా..

ఎస్టీగా పుట్టడమే నేరమా..

0

ఎస్టీగా పుట్టడమే నేరమా..

కావాలనే కేసులో ఇరికించారు

అక్రమార్కులపై చర్యలు లేవు

నన్ను మాత్రమే వేధిస్తున్నారు

బీహార్ ఐపీఎస్ సునీల్ నాయక్ పోస్టు

రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ తనపై జరుగుతున్న పరిణామాలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంచలన ప్రకటన చేశారు. తాను ఎస్టీ (లంబాడి సామాజికవర్గంలో) పుట్టడమే నేరమా అని ఆయన ప్రశ్నించారు. ఉన్నత ఉద్యోగాల్లో అణగారిన కులాల వారు ఉంటే ఓర్వలేకనే తనపై కుట్రలు పన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి 2024లో నమోదైన ఎఫ్ఐఆర్ లో అసలు తన పేరే లేదని, కానీ కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని బిహార్ ఐపీఎస్ ఆరోపించారు.
ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారుడు (రఘురామ) తనను నేరుగా బెదిరించాడని సునీల్ నాయక్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్‌లకు వ్యతిరేకగా మాట్లాడాలని, లేదంటే తనను నేరస్తుడిగా మారుస్తానని తనను హెచ్చరించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఎంతమందిని ప్రభావితం చేశారో తెలియాలంటే కాల్ డేటా బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఐఐటీ చెన్నైలో చదివి, కష్టపడి ఐపీఎస్ సాధించిన తనను కేవలం కుల వివక్షతోనే టార్గెట్ చేస్తున్నారని బిహార్ ఐపీఎస్ సునీల్ నాయక్ ఆరోపించారు. మరోవైపు, తన కుటుంబం పట్ల అధికారులు ప్రవర్తించిన తీరుపై సునీల్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి అవమానించారని, ఆ వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పలువురు వ్యక్తులు అక్రమంగా కోట్లాది రూపాయల బహుమతులు పొందినా, భూ దందాలు, మైనింగ్ అక్రమాలకు పాల్పడినా వారిపై విచారణ లేదని, కేవలం తనపైనే ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. తన వద్ద అన్ని ఆధారాలు, కాల్ రికార్డింగ్‌లు ఉన్నాయని, సరైన సమయంలో వాటన్నింటినీ కోర్టు ముందు ఉంచి న్యాయ పోరాటం చేస్తానని సునీల్ నాయక్ ప్రకటించారు. పోలీసులు బిహార్ కు వెళ్లి ఐపీఎస్ సునీల్ నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. మొదట సునీల్ నాయక్ పట్నా సివిల్ హైకోర్టును ఆశ్రయించగా.. ఏపీ పోలీసులు కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టుకు, అక్కడి ప్రభుత్వానికి సమర్పించిన తరువాత రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో అదుపులోకి తీసుకురావాలని చూడగా ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్‌ను పట్నా సివిల్ కోర్టు కొట్టివేసింది. 30 రోజులపాటు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version