Home Politics Andhra Pradesh ఎన్డీఏలో చేరితే ఆహ్వానిస్తా

ఎన్డీఏలో చేరితే ఆహ్వానిస్తా

0

తమిళ రాజకీయాల్లో మార్పు తెస్తారు

ఆధ్యాత్మికతను విస్మరించే పాలిటిక్స్ నిలబడవు

టీవీకే విజయ్ రాజకీయాలపై పవన్

తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు

తంతి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడు రాజకీయాలు, ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రయాణం, ఎన్డీఏ కూటమితో ఉన్న సంబంధం భవిష్యత్తు పరిణామాలపై సంచలన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తమిళ వెట్రి కళగం పార్టీని స్థాపించిన నటుడు విజయ్ గురించి పవన్ కల్యాణ్ ప్రశంసించారు. విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. విజయ్ ఒక మంచి వ్యక్తి, ఆయనకు సమాజం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన దేశాభివృద్ధిని ఆకాంక్షిస్తే ఎన్డీఏ కూటమిలోకి రావడాన్ని తాను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను అని పవన్ పేర్కొన్నారు. విజయ్ వంటి యువ నాయకులు జాతీయ దృక్పథంతో పనిచేయడం తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తమిళనాడులోని ద్రావిడ రాజకీయాల గురించి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం మరియు ఆధ్యాత్మికతను విస్మరించి చేసే రాజకీయం ఎక్కువ కాలం నిలబడదని, మార్పు అనేది అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడులో కూడా జాతీయవాదం బలపడాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా విజయ్ వంటి వారు అడుగులు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. అయితే విజయ్ ను ఎన్డీఏ కూటమిలోకి రావాలని తాను ఎలాంటి ప్రతిపాదన పెట్టలేదన్నారు. ఆయనను కలిసి పాతికేళ్లు అవుతోందన్నారు. రాజకీయాల్లో సినిమా స్టార్లు ఎదుర్కొనే సవాళ్లపై తన అనుభవాలను పంచుకుంటూ, విజయ్ రాజకీయాల్లో రాణించాలంటే పట్టుదల చాలా అవసరమని పవన్ సూచించారు. విమర్శలను ఎదుర్కొంటూ ప్రజల్లో ఉంటేనే విజయం సాధ్యమని, విజయ్‌కు ఆ స్థాయి ఓపిక ఉందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ముందుకు వెళ్తోందని, ఈ ప్రయాణంలో కలిసి వచ్చే ప్రతి ఒక్కరినీ ఎన్డీఏ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ అడుగులు ఎటువైపు ఉంటాయన్న సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలో, పవన్ కల్యాణ్ ఆయనను ఎన్డీఏలోకి ఆహ్వానించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version