బండారు దత్తాత్రే –ముఖ్యమంత్రులు సయోధ్యతో ముందుకు వెళ్లాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం రాత్రి రాజమహేంద్రవరం వచ్చిన మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ, తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్లు ప్రసంగించకుండా వాకౌట్ చేయడాన్ని అనవసర వివాదంగా మార్చవద్దని ఆయన సూచించారు. గవర్నర్లు రాజ్యాంగబద్ధమైన అధికారులు అని, వారికి నిర్దిష్టమైన రాజ్యాంగ విధులు ఉన్నాయని గుర్తు చేశారు. ఆ విధుల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు సృష్టించకూడదన్నారు. గవర్నర్లు, ముఖ్యమంత్రులు పరస్పర సయోధ్యతో ముందుకు వెళ్లాలని సూచించారు. అసెంబ్లీలో జాతీయ గీతం ఆలపించడంపై గవర్నర్లు వ్యతిరేకించారని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రాజమండ్రికి నాలుగు వేద ఇళ్లను కేటాయించినట్లు గుర్తుచేశారు. పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మహిళా అభ్యున్నతి దేశ అభివృద్ధికి కీలకమని, తెలుగు భాషను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. కులమతాలకు అతీతంగా భారతమాతను గుర్తించి జాతీయ భావనను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు.
