Home Politics Andhra Pradesh అరకు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

అరకు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

0

200 ఎకరాల్లో ‘అరకు ఆర్ట్ విలేజ్’ ఏర్పాటు,త్వరలో ఉత్తరాంధ్రలో ‘డోలి’ రహిత గ్రామాలు,₹500 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రోడ్ల కనెక్టివిటీ,ప్రపంచ ఆదివాసి దినోత్సవం నాటికి ‘ఆర్ట్ విలేజ్’*మంత్రి గుమ్మడి సంధ్యారాణి,గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అరకు ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం అరకు ఫైనరీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

అరకు సంస్కృతిని, కళలను ప్రపంచవ్యాప్తం చేసేందుకు అరకు వేలి మండలం చొంపి గ్రామంలో 200 ఎకరాల్లో ‘అరకు ఆర్ట్ విలేజ్’ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రముఖ ఆర్కిటెక్ట్‌ల సలహాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టును, ఈ ఏడాది ఆగస్టు 9న ‘ప్రపంచ ఆదివాసి దినోత్సవం’ సందర్భంగా ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్రలోని ఏడు ఏజెన్సీ నియోజకవర్గాల్లో ప్రజల రవాణా ఇబ్బందులను తొలగించి, డోలి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 500 కోట్ల రూపాయలతో గ్రామాలకు రోడ్ల అనుసంధాన కార్యక్రమం చేపడుతున్నామని, ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అరకు కాఫీకి సాటిగా స్థానిక చిరుధాన్యాలతో తయారు చేసిన ‘అరకు కౌన్ అరకు తాలి’లను పర్యాటకులకు పరిచయం చేస్తామన్నారు. పర్యాటక రంగం ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు క్యారవాన్ టూరిజం, హోమ్ స్టే టూరిజం, అడ్వెంచర్ పార్కులు రిసార్టులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగిన అరకు ఉత్సవాలు అత్యంత విజయవంతమయ్యాయని తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల గిరిజన కళాకారుల ప్రదర్శనలు, అరకు కార్నివాల్, మ్యూజికల్ నైట్స్, హెలీ టూరిజం గాలికొండ ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఐటిడిఏ పిఓ తిరుమణి శ్రీ పూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version