Home Uncategorized రాష్ట్రంలో ప్రతిరోజూ పండుగే..

రాష్ట్రంలో ప్రతిరోజూ పండుగే..

0

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
* ఎంఎస్ఎంఈ పార్కుల్లో బీసీలకు ప్రాధాన్యం
* బీసీలకు ఆర్థిక, రాజకీయ గుర్తింపు టీడీపీతోనే…

*నూజివీడు/ఏలూరు* : (జయ జయహే) సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతి రోజూ పండగేనని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఆనందం వెలిబుచ్చారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో బీసీలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. వడ్డెర్లను ఎస్టీలో చేర్చే విషయమై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బ్రిటీషర్ల దాష్టీకాలను ఎదిరించి… మొట్టమొదటి స్వాతంత్ర్య పోరాటం జరిపిన యోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. ఓబన్న చేసిన పోరాటాన్ని ముందు తరాలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారన్నారు. దీనిలో భాగంగా ఓబన్న జయంతిని అధికారికంగా, రాష్ట్ర పండుగగా నిర్వహించాలని శాశ్వత జీవో జారీచేశారన్నారు. గత సంవత్సరం గుంటూరులో, ఈ ఏడాది అనంతపురంలో ఓబన్న జయంతిని అధికారికంగా జరుపుకున్నామన్నారు. నూజివీడులో వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరించడం అభినందనీయమని మంత్రి సవిత కొనియాడారు.

*ఎంఎస్ఎంఈ పార్కుల్లో బీసీలకు ప్రాధాన్యం*

కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిందన్నారు. ఉగాది సందర్భంగా నిరుద్యోగ యువతకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెబుతూ, జాబ్ క్యాలెండర్ విడుదల చేశారన్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ పథకాలతో ఎక్కువగా లబ్ధి పొందేది బీసీలేనని మంత్రి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతి రోజూ పండుగ వాతావరణమే ఉంటోందన్నారు. బీసీలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వాలవేనన్నారు. బీసీ రక్షణ చట్టం తుది ముసాయిదా సిద్ధమైందని, త్వరలోనే ఈ చట్టాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు కేబినెట్ లో ఎనిమిది మంది బీసీ మంత్రులకు కీలక శాఖలు అప్పగించారన్నారు. కేంద్రమంత్రిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కింజరాపు రామ్మోహననాయుడికి అవకాశమిచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో బీసీలకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version