ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ కార్యక్రమం విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించబడుతుంది. సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు 8688400499 ఫోన్ నంబర్ ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సరఫరా అంతరాయాలు, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, కొత్త కనెక్షన్ల జారీలో జాప్యం, సరఫరా పునరుద్ధరణలో ఆలస్యం, ట్రాన్స్ఫార్మర్ మార్పిడి, రూఫ్‌టాప్ సోలార్ వంటి వివిధ సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. ఈ అవకాశాన్ని సంస్థ పరిధిలోని 11 జిల్లాల విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఈపీడీసీఎల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
