ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదు ఐ ఎఫ్ ఆర్ నేపథ్యంలో సమీక్ష 100మంది హోటల్ ప్రతినిధులు హాజరు ,విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐయాన్స్-కాన్ క్లెవ్ అఫ్ చీఫ్స్ నిర్వహించనున్న నేపథ్యంలో నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి కీలక ఆదేశాలిచ్చారు. నగరంలో గల హోటల్ యాజమాన్యం, ప్రతినిధులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. నగర పోలీసు సమావేశమందిరం నందు నిర్వహించిన ఈ సమావేశం నందు విశాఖపట్నం పోలీస్ కమీషనరేట్ పరిధిలో గల సుమారు 100 మంది హోటల్ యాజమాన్యం మరియు ప్రతినిధులతో పాటుగా డిసిపీ-01, డిసిపీ-02, ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ అధికారులు, స్పెషల్ బ్రాంచ్అధికారులు, ఏ.డి.సి.పిలు, ఏ.సి.పి లు, సి.ఐ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
– నగరంలో రానున్న రోజుల్లో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు పర్యాటకుల భద్రత దృష్ట్యా పలు కీలక ఆదేశాలను జారీ చేశారు.

– విదేశీ ప్రతినిధుల చెక్-ఇన్ నిబంధనలు అన్ని తప్పనిసరిగా అమలుపరచాలి, వారు వచ్చిన 24 గంటల లోపు ఫామ్-III (పాత ఫామ్-సి) ను తప్పనిసరిగా అందజేయాలి.
– ప్రతి హోటల్ ప్రవేశం వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ పరికరాలు ఖచ్చితంగా పని చేయాలి, హోటల్ ఆవరణ మొత్తం, ముఖ్యంగా పార్కింగ్ మరియు కారిడార్లలో నిఘా పెంచేలా మెరుగైన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుతో పాటుగా, వాటి బ్యాక్ అప్ సక్రమముగా ఉండాలి.
– విదేశీ ప్రతినిధుల ఆహారం మరియు పానీయాల కల్తీని అరికట్టడానికి సేకరణ నుండి వడ్డన వరకు కఠినమైన తనిఖీలు చేపట్టాలి. నీటిని ప్రతిరోజూ రసాయన పరీక్ష చేయాలి. హోటల్‌లో ప్రత్యేక డాక్టర్ల బృందం, వైద్య పరికరాలు మరియు అంబులెన్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రితో ఒప్పందం చేసుకోవాలి,అగ్నిమాపక పరికరాలను తనిఖీ చేసి, సిబ్బందికి ఫైర్ డ్రిల్స్‌లో శిక్షణ ఇవ్వాలి.
– సందర్శకుల వివరాలను సేకరించేటప్పుడు ఎటువంటి అలసత్వం వహించకూడదు,వారి గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తనిఖీ చేయాలి.
– అత్యవసర పరిస్థితి మరియు తరలింపు అత్యవసర సమయంలో అతిథులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హోటల్ ప్లాన్ సిద్ధంగా ఉండాలి మరియు బిల్డింగ్ బ్లూ-ప్రింట్స్‌ను పోలీసులతో పంచుకోవాలి, అన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్ కీలు పని చేసే స్థితిలో ఉండాలి
– హోటల్‌లో పనిచేసే శాశ్వత, తాత్కాలిక సిబ్బంది అందరికీ పోలీస్ వెరిఫికేషన్ నిర్వహించాలి.
– విదేశీ ప్రతినిధులు లేదా వివిఐపి లు బస చేసినప్పుడు వారి భద్రత మరియు గోప్యతకు భంగం కలగకుండా చూడాలి. అనుమతి లేకుండా ఫోటోలు లేదా సెల్ఫీలు దిగడం చట్టవిరుద్ధం. నగరాన్ని సురక్షితంగా ఉంచడంలో హోటల్ యాజమాన్యాలు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలనీ, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా అసాధారణ పరిస్థితులు లేదా భద్రతాపరమైన ముప్పులు గమనించినట్లయితే, వెంటనే కమిషనర్ కు నేరుగా సంప్రదించేందుకు 79950 95799 నంబరును అందుబాటులో ఉంటుందని డా.శంఖబ్రత బాగ్చి ఈ సందర్బంగా తెలిపారు.