ప్రపంచవ్యాప్తంగా నేరాలు ఏమాత్రం లేని సమాజాన్ని నిర్మించడం అనేది ప్రస్తుత కాలంలో దాదాపు అసాధ్యమైన విషయంగా కనిపిస్తుంది. అయితే కొన్ని దేశాలు తమ అద్భుతమైన పరిపాలన, కఠినమైన చట్టాల అమలు, సామాజిక విలువల ద్వారా నేరాల సంఖ్యను కనిష్ఠ స్థాయికి తగ్గించడంలో విజయం సాధించాయి. సాధారణంగా ఐస్‌లాండ్, సింగపూర్, జపాన్, న్యూజిలాండ్ వంటి దేశాలు ప్రపంచంలోనే అత్యల్ప నేరాలు నమోదయ్యే ప్రాంతాలుగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఈ దేశాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అక్కడి రక్షక భట వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా, సాధారణ ప్రజల్లో కూడా దేశ చట్టాల పట్ల అపారమైన గౌరవం, బాధ్యతాయుతమైన ప్రవర్తన కనిపిస్తుంది. ఇది ఆయా దేశాల ప్రగతికి ప్రధాన కారణం.
ఉదాహరణకు ఐస్‌లాండ్ దేశాన్ని పరిశీలిస్తే, అక్కడ హత్యలు, దోపిడీలు లేదా దొంగతనాలు వంటి తీవ్రమైన నేరాలు జరగడం చాలా అరుదు. ఆ దేశంలో జనాభా తక్కువగా ఉండటం ఒక కారణమైతే, సమాజంలో ఆర్థిక సమానత్వం ఎక్కువగా ఉండటం మరో ప్రధాన కారణం. ప్రజలందరికీ సమానమైన అవకాశాలు, ఉన్నత విద్యా స్థాయి అందుబాటులో ఉండటం వల్ల అక్కడ నేర ప్రవృత్తి చాలా తక్కువగా ఉంటుంది. ప్రజల మధ్య పరస్పర నమ్మకం, సామాజిక భద్రత అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే సింగపూర్ దేశంలో చట్టాల అమలు అత్యంత కఠినంగా ఉంటుంది. అక్కడ చిన్నపాటి పొరపాటు చేసినా సరే, ప్రభుత్వం భారీ స్థాయిలో జరిమానాలు లేదా కఠినమైన శిక్షలను విధిస్తుంది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడం అనేది అక్కడ తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. అందువల్ల ప్రజలు క్రమశిక్షణతో చట్టాలను పాటిస్తారు. అక్కడ పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా ప్రజలు నిర్భయంగా తిరగగలిగే వాతావరణం ఉంటుంది.
జపాన్ దేశంలో నేరాలు తక్కువగా ఉండటానికి అక్కడి సామాజిక విలువలు మరియు సంస్కృతి ప్రధాన కారణం. ఇతరులకు ఇబ్బంది కలిగించడం లేదా ఇతరుల వస్తువులను ఆశించడం అనేది తప్పు అనే భావనను చిన్నప్పటి నుంచే పిల్లల మనసుల్లో బలంగా నాటుతారు. పాఠశాల స్థాయి నుండే నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం వల్ల అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా నేరాలకు దూరంగా ఉంటారు. నిజాయితీ, సమయపాలన, పరుల పట్ల గౌరవం అనేవి వారి జీవనశైలిలో అంతర్భాగంగా మారిపోయాయి. ఈ ఉదాహరణలు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నేరాలను అదుపు చేయాలంటే కేవలం చట్టాలు మరియు శిక్షలు మాత్రమే సరిపోవు. సమాజంలో ఆర్థిక సమానత్వం, ఉన్నతమైన నైతిక విలువలు, నాణ్యమైన విద్య మరియు సామాజిక బాధ్యత కూడా ఎంతో అవసరం. ప్రభుత్వాలు ప్రజల అవసరాలను తీరుస్తూ, వారికి రక్షణ కల్పిస్తున్నప్పుడు నేరాల సంఖ్య సహజంగానే తగ్గుముఖం పడుతుంది.
ప్రపంచంలోని అన్ని దేశాలు ఇటువంటి ఆదర్శవంతమైన పద్ధతులను అనుసరిస్తే శాంతియుత సమాజం ఏర్పడుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో నేరాల రేటు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం అక్కడి ప్రజల ఆలోచనా విధానం మరియు ప్రభుత్వ పారదర్శకత. కేవలం భయం వల్ల కాకుండా, బాధ్యత వల్ల చట్టాన్ని గౌరవించే స్థితికి మనిషి ఎదిగినప్పుడు నేరాలు వాటంతట అవే మాయమవుతాయి. ఏ దేశంలోనైతే మహిళలు, వృద్ధులు మరియు పిల్లలు పూర్తి భద్రతతో జీవిస్తారో, ఆ దేశమే నిజమైన అభివృద్ధిని సాధించినట్లు భావించవచ్చు. శాంతియుత జీవనమే మానవ నాగరికతకు అసలైన నిదర్శనం
(సి.హెచ్.ప్రతాప్)
