క్వారీ సెంటర్‌లోని శ్రామిక భవన్ స్థలంలో నిర్వహించిన గోదావరి ఎలక్ట్రికల్ వెల్ఫేర్ ట్రేడ్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మార్గాని భరత్ రామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం హయాంలో తన చొరవతో 1800 గజాల స్థలాన్ని శ్రామిక భవన నిర్మాణానికి కేటాయించడంతో పాటు ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.1 కోటి మంజూరు చేయించామని తెలిపారు. అయితే అనంతరం ప్రభుత్వం మార్పుతో రాజకీయ కక్షల కారణంగా భవన నిర్మాణం నిలిచిపోయిందని ఆరోపించారు.
శ్రామికుల పక్షాన నిలబడేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొంటూ, కూటమి ప్రభుత్వం తక్షణమే శ్రామిక భవన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే శ్రామికుల తరఫున పోరాటం చేపడతామని హెచ్చరించారు.
సిటీ పరిధిలోని వివిధ విభాగాల శ్రామికులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని అప్పట్లో సాధించామని, భవన నిర్మాణం పూర్తయ్యే వరకు పార్టీ శ్రామికులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 20న నిర్వహించనున్న మహా ధర్నాకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
నూతన కార్యవర్గ అధ్యక్షుడు బొజ్జా రామకృష్ణ, కార్యదర్శి ఆసపు శ్రీనివాస్ (బుజ్జి), గౌరవ సలహాదారు బోడా వెంకట గోపాల కృష్ణ రెడ్డి, ఖజాంచి సర్వకోట లక్ష్మణరావు తదితర సభ్యులకు భరత్ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సప్ప ఆదినారాయణ, సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, ఉమ తదితరులు, శ్రామికులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
