రెండు బోట్ల సీజ్
రాజమహేంద్రవరం, జయజయహే ప్రతినిధి: తూర్పు గోదావరి జిల్లాలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా గోదావరి నదిలో అనుమతులు లేకుండా సంచరిస్తున్న రెండు బోట్లను పోలీసులు సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ పర్యవేక్షణలో తాళ్లపూడి పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా సుమారు 20 మంది పర్యాటకులతో గోదావరి ఇసుక తిన్నెల వద్ద తిరుగుతున్న రెండు బోట్లను ఎస్‌ఐ రామకృష్ణ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత బోటు నిర్వాహకులు అవసరమైన అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం గమనించిన అధికారులు వెంటనే వాటిని సీజ్ చేశారు.
శివరాత్రి వేళ భక్తులు, పర్యాటకులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలుగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన బోటు నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
అనుమతులు లేకుండా బోట్ల నిర్వహణ చట్టవిరుద్ధమని, భద్రతా చర్యలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పండుగల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
