Home Politics Andhra Pradesh గుంటూరులో భారత్ రంగ్ అంతర్జాతీయ నాటక మహోత్సవం

గుంటూరులో భారత్ రంగ్ అంతర్జాతీయ నాటక మహోత్సవం

0

బ్రోచర్ ఆవిష్కరణ,తాడేపల్లి మండలం ప్రాతూరులోని ఏపీ నాటక అకాడమీ కార్యాలయంలో ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు గుంటూరులో నిర్వహించనున్న ‘భారత్ రంగ్ అంతర్జాతీయ నాటక మహోత్సవం–2026’ కు సంబంధించిన ముందస్తు సమాచారం బ్రోచర్‌ను ఏపీ నాటక అకాడమీ చైర్మన్, కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ ఆవిష్కరించారు.నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించే భారత్ రంగ్ మహోత్సవ్‌లో భాగంగా, వేదిక (తెలుగు నాటక సమాఖ్య సంస్థ), యడ్లపాడు ఆధ్వర్యంలో ఈ అంతర్జాతీయ నాటక మహోత్సవం నిర్వహించబడుతున్నట్లు వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు తెలిపారు.ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ, భారత్ రంగ్ అంతర్జాతీయ నాటక మహోత్సవం–2026 ఫిబ్రవరి 6, 7, 8, 9, 10 తేదీల్లో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, అలాగే అంతర్జాతీయ స్థాయిలోని నాటక బృందాలు ఈ మహోత్సవంలో పాల్గొననున్నాయని ఆయన తెలిపారు.
నాటక కళకు విస్తృత ప్రాచుర్యం కల్పించడంతో పాటు, తెలుగు నాటకాన్ని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మరింత బలంగా నిలబెట్టడమే ఈ మహోత్సవం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు నాటక రంగానికి చెందిన పలువురు ప్రముఖులను సత్కరించనున్నట్లు కూడా వెల్లడించారు.భారత్ రంగ్ అంతర్జాతీయ నాటక మహోత్సవం విజయవంతానికి ఏపీ సాంస్కృతిక సృజనాత్మక సమితి, ఏపీ నాటక అకాడమీ ద్వారా అవసరమైన అన్ని విధాల సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు.
భారతీయ నాటక సంప్రదాయానికి గౌరవం చేకూర్చుతూ, నాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే దిశగా భారత్ రంగ్ అంతర్జాతీయ నాటక మహోత్సవం ఒక కీలక అడుగుగా నిలుస్తుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో వేదిక సభ్యులు గుదే పాండురంగారావు, పోపూరి నాగేశ్వరరావు, ముత్తవరపు పద్మారావు, నటులు–దర్శకులు పొగర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version